ఘనంగా ప్రారంభమైన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
గద్వాల, లోకల్ గైడ్ : ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు జరిపించనున్నారు. శనివారం ఉదయం పంచామృతా భిషేకం, వాస్తుపూజ, వాస్తు హోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణం రాత్రికి తెప్పోత్సవంతో బ్రహ్మోత్స వాలు ప్రారంభం అయ్యాయి. 11న పంచామృ తాభిషేకం, స్వామి వారి ఉపనయనం, రాత్రికి ప్రభోత్సవం, 12న మధ్యాహ్నం 12.15 గంటలకు సీతారాముల కల్యాణం, సాయంత్రం రథంగ హోమం, 9 గంటలకు కుంభం, రాత్రి 10కి రథోత్సవం జరిపించనున్నారు. 13న చౌకి సేవ, రాత్రికి ప్రభోత్సవం, 14న అమృత స్నానము, పంచామృ తాభిషేకం, రాత్రికి పల్లకీసే వతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అనంతరం ప్రతి శనివారం నెల రోజుల పాటు భక్తులు స్వామికి పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారని ఆలయ వ్యవస్థాపక వంశీయులు డీకే భరత సింహారెడ్డి మేనేజర్ రామన్ గౌడ్ అర్చకులు ప్రహ్లాద చారి మారుతి సందీప్ తెలిపారు.
శ్రీ బీచుపల్లి ఆంజనేయ స్వామి వారి చరిత్ర..
శ్రీ కృష్ణ దేవరాయల వారి గురువులైన వ్యాసరాయల వారు చాలా ప్రసిద్ది చెందిన వారు. వీరు దినమునకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయనిదే నిదురించెడి వారు కాదు. వీరు ప్రతిష్ఠ చేసిన ఆంజనేయ స్వామి విగ్రహలకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. విగ్రహము ఇరువైపుల శంఖు, చక్రములు వుండుటవలన వ్యాసరాయుల వారు విగ్రహ ప్రతిష్ఠ చేశారని నిదర్శనం. ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ 16వ శతాబ్దమున జరిగిందని చారిత్రక పరిశోధకులు నిర్వహించినారు. ఈ ఆంజనేయ స్వామి వారు వ్యాసరాయల వారికి కలలో కనపించి రేపు ఉదయం నన్ను దర్శించుటకు ముందుగా ఎవరు వస్తారో వారినే నాకు ప్రతి రోజూ పూజలు చేయుటకు నియమించమని ఆదేశించారు. మరుసటి ఉదయం దర్శనమునకు మొదట ఒక పశువుల కాపరి పశువులను మేపుతూ అటుగా వచ్చి స్వామి వారిని దర్శించుకున్నాడు. వ్యాసరాయల వారు అతనినే పూజారిగా నియమించెను. అతడు బోయి కులస్తుడు. అతని పేరు బీచుపల్లి. రాను రాను ఈ దేవస్థానమునకు బీచుపల్లి రాయుడని పేరు వచ్చింది. ఈ దేవస్థానము చుట్టుముట్టు ప్రాంతములలో చాలా మందికి బీచుపల్లి అను పేర్లు కలవు. వ్యాసరాయలచే ప్రతిష్ఠ జరిగిన బీచుపల్లి ఆంజనేయ స్వామి వారిని గద్వాల సంస్థానపు రాజులు ప్రతి రోజు దర్శించుకునే వారని చరిత్ర చెబుతొంది.
Comment List