ఐపీఎల్ 18 పునఃప్రారంభానికి సిద్ధం – బీసీసీఐ అనుమతితో తాత్కాలిక విదేశీ ఆటగాళ్లు బరిలోకి...
లోకల్ గైడ్:
ఇంకొన్ని రోజుల్లో పునఃప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 2025 (ఐపీఎల్ 18) సీజన్‌ను ముందు ఉంచుకొని, విదేశీ ఆటగాళ్ల అందుబాటుపై ఏర్పడిన అనిశ్చితిని తొలగించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీములకు తాత్కాలిక భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం, అందుబాటులో లేని విదేశీ ఆటగాళ్ల స్థానంలో ఇతర ఆటగాళ్లను తక్షణమే జట్టులోకి తీసుకోవచ్చు.దీనిపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ఈ సీజన్‌కు అందుబాటులో లేని ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తీసుకుంది. అయితే ఈ రిప్లేస్‌మెంట్లు తాత్కాలికమే. వచ్చే ఏడాది జరిగే మినీ వేలంలో ఈ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే వారు వేలంలో పాల్గొనడానికి అర్హులే అని ఐపీఎల్ సీఈవో హేమంగ్ అమిన్ ఫ్రాంచైజీలకు తెలిపాడు.
వెనక్కి వెళ్లిన ఆటగాళ్ల రాకపై క్లారిటీ
స్వదేశానికి వెళ్లిన విదేశీ ఆటగాళ్లలో చాలా మంది తిరిగి వచ్చే అవకాశం ఉందని ఫ్రాంచైజీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో స్టార్క్, హాజిల్‌వుడ్ మినహా మిగతా దేశాల క్రికెటర్లు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. బుధవారం నాటికి కొంతమంది విదేశీ ఆటగాళ్లు తమ జట్లతో కలిశారు. మిగతావారు కూడా శుక్ర, శనివారాల్లో జట్టులో చేరే అవకాశం ఉంది.
అయితే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు లీగ్ దశ పూర్తైన వెంటనే తిరిగి తమ దేశాలకు వెళ్లనున్నారు. ఇంగ్లండ్ క్రికెటర్లు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హాజరు కావాల్సి ఉండడంతో ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉండరు. ఈ విషయం ఆయా బోర్డులు స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మే 26న, ఇంగ్లండ్ ఆటగాళ్లు మే 27న భారత్ విడిచిపెట్టనున్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితి గుజరాత్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ జట్లపై ప్రభావం చూపనుంది.
ప్రాక్టీస్ మళ్లీ ప్రారంభం
ఐపీఎల్ పునఃప్రారంభం ప్రకటన అనంతరం జట్లు తమ ప్రాక్టీస్ సెషన్లు ప్రారంభించాయి. గుజరాత్ టైటాన్స్ మంగళవారం నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టగా, బుధవారం పంజాబ్, లక్నో, ముంబై ఆటగాళ్లు నెట్స్‌లో శ్రమించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కూడా చెపాక్ స్టేడియానికి చేరుకుంటున్నట్టు ఆ జట్టు ప్రకటించింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం బుధవారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.
Comment List