అక్కడ పార్కింగ్ స్థలం చూపిస్తేనే వాహనాలకు రిజిస్ట్రేషన్ .....
లోకల్ గైడ్ :
మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కీలక ప్రకటన చేశారు. కొనుగోలుదారులు తమ వాహనాలకు రిజిస్ట్రేషన్ పొందాలంటే, పౌర సంస్థ కేటాయించిన పార్కింగ్ స్థలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో పార్కింగ్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఈ సమస్యను పరిష్కరించేందుకు పట్టణాభివృద్ధి శాఖ పార్కింగ్ ప్లాజాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కొత్త నిబంధన అమలు చేసింది. ఇకపై పార్కింగ్ స్థలం కలిగిన వారికి మాత్రమే కార్లు విక్రయించాలన్న నిబంధనను అమలు చేస్తోంది. ఈ మేరకు, వాహన రిజిస్ట్రేషన్‌కు పార్కింగ్ స్థల పత్రాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.నగరాల్లోని అపార్ట్‌మెంట్లలో నివసించే చాలా మందికి సరైన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల వారు తమ కార్లను రోడ్లపై నిలిపేస్తున్నారు. దీనివల్ల జనాభా అధికంగా ఉన్న నగరాల్లో ట్రాఫిక్ తీవ్రంగా పెరుగుతోంది. ఈ పరిస్థితులు అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాల వంటి అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయని మంత్రి అన్నారు. అందుకే, వాహన కొనుగోలుదారులు పార్కింగ్‌కు సంబంధించిన ఆధారాలను తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
Comment List