భార‌త్- పాక్ ఉద్రిక్త‌ల న‌డుమ‌.... నిత్య అవ‌స‌ర వ‌స్తువుల‌పై కేంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న

భార‌త్- పాక్ ఉద్రిక్త‌ల న‌డుమ‌.... నిత్య అవ‌స‌ర వ‌స్తువుల‌పై కేంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న

భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఏ పరిస్థితులు ఎదురైనా, దేశంలో కూరగాయలు, పప్పులు మరియు ఇతర నిత్యావసర వస్తువుల కొరత ఉండదని స్పష్టం చేసింది. తగినంత నిల్వలు సిద్ధంగా ఉన్నాయని హామీ ఇచ్చింది.పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి ముఖ్యమైన ఆహార పదార్థాల ధరలను నియంత్రణలో ఉంచేందుకు ప్రభుత్వం నిశితంగా పరిశీలన కొనసాగిస్తోంది. అన్ని నగరాల్లో సరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆహార కార్యదర్శులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. నిత్యావసరాల ధరలు కట్టడి చేయడం, నిల్వల దుర్వినియోగాన్ని నివారించడం కోసం వ్యాపారులు, సరఫరాదారులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు పంపినట్లు వెల్లడించింది.

చండీగఢ్‌లో నిల్వలపై నిషేధం
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. చండీగఢ్‌లో నిత్యావసర వస్తువుల నిల్వలపై నిషేధం విధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను మూడు రోజుల్లోపు అధికారులకు తెలియజేయాలని సూచించారు. కొందరు వ్యాపారులు మరియు సంస్థలు పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసరాల నిల్వలను అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని, అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూరు’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలపై దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్‌లో శుక్రవారం ఉదయం నుంచి ఎయిర్ సైరన్ల మోగింపు ప్రజలను ఆందోళనకు గురి చేసింది. పాక్ నుంచి దాడుల ప్రమాదం ఉందంటూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీల్లోకి రావద్దని స్పష్టంగా పేర్కొంది. పంచకుల, మొహాలీ, పటియాలా, అంబాలా జిల్లాల్లోనూ ఇదే తరహా హెచ్చరికలు జారీ అయ్యాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News