దేశంలో ఐటిరంగాన్ని పరిచయం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీకి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్..
లోకల్ గైడ్ మంచిర్యాల::
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నాడు దేశానికి పరిచయం చేసిన సాంకేతిక పరిజ్ఞానమే దేశాన్ని రక్షణ కవచంలా నేటికీ కాపాడుతుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయన ఆశయాలను కొనసాగిస్తు,ఆయన బాటలోనే క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.దేశంలో ఐటి రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి,నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడిగా సేవలందించిన మహానీయుడని అన్నారు.దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికి,ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయనకే దక్కిందని ప్రశంసించారు.ఐటి రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవాత్మక మార్పులు తీసుకురావడం,దేశ యువతను సాంకేతిక రంగం వైపు మళ్లించమే కాకుండా ప్రపంచ దేశాల ప్రముఖ కంపెనీలకు భారతీయులనే సిఈఓ లుగా ప్రాతినిధ్యం వహించే స్థాయికి భారతదేశాన్ని ముందుకు నడిపించారని అన్నారు.నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.నవభారత నిర్మాత సృష్టికర్త దేశానికి దిశా నిర్దేశం చూపిన మార్గదర్శకుడు అని,బడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేశారని,ఈ దేశప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం తెలిస్తే అలాంటి వారిని పార్టీ నుండి తక్షణమే తొలగిస్తామని నాయకులను,కార్యకర్తలను హెచ్చరించారు.పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో తాము వెనుకబడి ఉన్నామని ఇకనుండి మెరుగుపరుచుకుంటామని తెలిపారు.పార్టీలో ఎటువంటి సమస్యలు ఉన్న నాయకులు తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని,సామాజిక మాధ్యమాలలో చర్చలు జరపవద్దని నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List