సమాజాన్ని సంస్కృతిని రక్షించేది కుటుంబమే
సమాజాన్ని సంస్కృతిని రక్షించేది కుటుంబమే
(కనుమరుగైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ )
సమాజం సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ సమాజంలో మానవ కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయి. సమాజంలో అనేక అవాంచిత
ధోరణులు ప్రబలి అనేక సమస్యలు ఏర్పడు తున్నాయి.ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను వివరించడం కోసం మే15 వి తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం గా జరుపుకుంటున్నాం.
సమాజంలో ఆధునికత' విదేశీ సంస్కృతి 'నాగరికత పెరిగి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మౌలిక మార్పులు వచ్చాయి. త్వరలోనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితులు రానున్నాయి. పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి .
ప్రత్యేక కుటుంబాలు_ విచ్చలవిడితనం.
ప్రస్తుతం ప్రత్యేక కుటుంబాలు ఏర్పడి పట్టించుకునేవారు లేక విచ్చలవిడి తనం పెరిగింది. పిల్లలకు ఆచారాలు సంస్కృతి 'సాంప్రదాయాలు మర్యాదలు తెలియజేసే తాతలు నానమ్మలు బాబయ్యాలు అత్తమ్మలు మామయ్యకు లేకపోవడంతో పిల్లల్లో అనేక వక్రధోరణులు రులు ప్రబలుతున్నాయి. కుటుంబ వ్యవస్థ బలహీనమైంది. సమాజంలో సామాజిక నష్టాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలను గ్రహించి ఐక్యరాజ్యసమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1993 మే 15న అంతర్జాతీయ కుటుంభ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. కుటుంభ వ్యవస్థ ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యం కోసం సభలు సదస్సులు వర్క్ షాపులు చర్చలు నిర్వహించి కుటుంబ పెద్దలు నైపుణ్యాన్ని అనుభవాలను పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో అవగాహన పెంచుకొని సహకారాన్ని అందించడం కుటుంబాల్లో నెలకొన్న విభేదాలు తొలగించి సుఖశాంతులను నెలకొల్పడం లాంటి లక్ష్యాలతో ప్రపంచవ్యాప్తంగా సభ్య దేశాలు ఈరోజు జరుపుకోవాలని ఐ'రా'స ఆదేశించడం గమనార్హం.
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం' 2025 థీమ్.
"కుటుంబ ఆధారిత విధానాలు సుస్థిరత అభివృద్ధి కోసం" అనే థీమ్ ను ఎంపిక చేశారు .ఈరోజు కుటుంబాల ప్రాముఖ్యతను సమాజంలో వారి పాత్ర పై అవగాహన కల్పిస్తారు .
నేటి రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు.చిన్న కుటుంబాలు చింతలేని కుటుంబాలు నాటి సామెత నేడు చిన్న కుటుంబాలలో చింతలు ఎక్కువ గొడవలు వ్యసనాలు' గౌరవాలు తక్కువై వ్యక్తి కేంద్రంగా కుటుంబాలు రూపు మార్చు కుంటున్నాయి. ఒక నాడు సుఖ దుఃఖాలకు సంతోషాలకు ఆనందాలకు వేదికగా నిలిచిన కుటుంబ వ్యవస్థ నేడు అహానికి వ్యక్తి స్వార్థానికి కేంద్ర బిందువైంది. కలిస్తే కలహాలు పలకరింపులకు బదులు పగలు ప్రతీకారాలకు వేదికలుగా మారిన దౌర్భాగ్య స్థితి నెలకొంది.ఫ్యామిలీ అంటే ఇష్టంలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇష్టం లేకున్నా ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం ఉన్నట్టు నటిస్తున్నారు. మనుషులతో కలవడానికి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. మనుష్యులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతుంది. దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగు కావడానికి కారణాలు
అహం అధికారం.
సమాజంలో పేరుకుపోయిన నిరక్షరాస్యత 'అనాలోచిత వైఖరి అతి తెలివి' అహం ఇతరులను తక్కువగాచూసే మనస్తత్వం అధికార చెలాయింపు చిన్న తప్పును భరించే శక్తి , సహనం ఓర్పు లేకపోవడం ఆదిపత్యవాదం
అజమాయిషీ తత్వం పెచ్చుపెరిగి పోయింది.
స్వేచ్ఛా జీవనం.
కుటుంబంలో సంపూర్ణ ప్రజాస్వామ్యం రాజ్యమేలడం. స్వేచ్ఛా యుత జీవనాన్ని కోరుకోవడం. పెద్దల నియంత్రణ లేకపోవడం . పెద్దల సలహా తీసుకోక పోవడం.సమిష్టి భావన లోపించడం.
పెద్దలు, పిల్లలు అందరు కూర్చొని భోజనం చేయక పోవడం .మాట్లాడుకొక పోవడం.సమిష్టి బాధ్యతలు లోపించడం వల్ల ఉమ్మడికుటుంబాలు తగ్గి పోతున్నాయి. ఆపదలో ఆదుకునే బంధువులు రాక బాధలను పంచుకునే బంధువులు లేక ఒంటరిగా మారుతున్నారు.
లోపించిన జవాబుదారీతనం.
కుటుంబ సభ్యులు ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈరోజు ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు. కానీ, ఇంట్లోని వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి నెలకొంది..జవాబుదారీతనం లోపించింది . ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నట్లు కలిసి మెలిసి ఉండే మనుసులు కానీ మనుషులు కానీ లేకుండా పోయారు. పెళ్లయిన వెంటనే వేరే కాపురాలు పెట్టుకొని జంటలుగా ఉండి కూడా మొబైల్ ఫోన్ పట్టుకుని ఒంటరై పోతున్నారు.
పెరుగుతున్న షాడిజం
చిన్న పొరపాటుకు అలిగి దగ్గరి వారిని రక్తసంబంధం వున్న వారిని దూరం చేసుకుంటున్నారు. ఒకరి నోటి దురుసు తనం కాఠిన్యత సంకుచిత మనస్తత్వం షాడిజం కుటుంబాన్ని మొత్తం చిన్నా భిన్నం చేస్తుంది .
పోటీతత్వం పోలికత్వం.
ఆర్థిక సమస్యలు 'సోషల్ స్టేటస్ 'విలాస జీవనం ఇతరులతో పోల్చుకొనే పోటీ తత్వం రాబడిని మించిన ఖర్చు ఇంటి పెద్దలు సరిగ్గా మేనేజ్ చేయలేక పోవడం వల్ల కుటుంబాలు పతమౌతున్నాయి.
ప్రస్తుత జీవనశైలి.
ప్రస్తుత జీవనశైలి మన. ఉమ్మడి లేదా విస్తరించిన కుటుంబ వ్యవస్థ. తరతరాలుగా కాపాడుతున్న సాంస్కృతి విలువలు దెబ్బ తినడానికి ప్రస్తుత జీవనశైలే కారణమని చెప్పవచ్చు ఇదే సమయంలో ఇతర దేశాలతో పోలిస్తే వసుధైక కుటుంబకం అన్న భావన మన రక్తంలోనే జీవించకు పోయింది. తరతరాలుగా మనం చాటి చెప్పుతున్న ఈ భావనను భావితరాలకు మనం అందజేయవలసిన బాధ్యత ఉన్నది.
సామాజిక వేత్తల ఆందోళన.
భార్యా' భర్తలు (తల్లి దండ్రులు) మధ్య అవగాహన లేకపోవడం. ప్రతి చిన్న విషయానికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుకు గురై ఇంటి నుండి వెళ్లిపోవడం.
ఫ్యామిలీల్లో గొడవలు, కొట్లాటలు' తగాదాలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు. అన్యోన్యత ఆత్మీయత 'అనురాగాలు, ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనుమరుగై పవిత్రమైన పునాదుల కలిగిన ఉమ్మడి కుటుంబాలు దూరమై కుటుంబ వ్యవస్థపై నమ్మకం సడలి పోతుందని ఈ స్థితి పలు సామాజిక సమస్యలకు దారి తీస్తుందని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
ఒంటరితనం వ్యసనాలు.
కుటుంబ వ్యవస్థలోని మార్పులు 'పరిస్థితులు యువతను ప్రభావితం చేస్తున్నాయి .పిల్లలను హాస్టళ్లలో వుంచి చదివించడం వల్ల సురక్షిత భావన లోపించి ఒంటరితనం వ్యసనాలు పెరిగాయి .యువత లో మాదక ద్రవ్యాల ( డ్రగ్స్) వినియోగం పెరిగింది . వయసు 31 యేళ్లు దాటినా యువత పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు. గత నాలుగు దశాబ్దాలుగా కుటుంబాల్లో జరుగుతున్న మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం ఫ్యామిలీ వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెప్పే విచిత్ర పరిస్థితి దాపురించే సామాజిక ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రపంచీకరణ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.
ప్రపంచీకరణ ' కార్పొరేట్ కల్చర్ 'ఆర్థిక స్థాయి 'ఆధునిక అవసరాలు, విదేశీ చదువులు 'విదేశీ కొలువులు ఆర్థిక వ్యత్యాసాలు, ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లలు విదేశాల్లో ఉండాల్సిన రావడం. పెద్దలు నిర్లక్ష్యానికి గురి కావడం దేశానికి సమాజానికి మంచిది కాదు. పోల్చుకోవడం' పోటీ తత్వం తదితర కారణాల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నిలబడని స్థితి నెలకొన్నది.
కుటుంబ విలువల క్షీణత.
ఉమ్మడి కుటుంబాల్లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అన్నదమ్ములు 'అక్క చెల్లెలు కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే బలమైన బంధం ఉంటుంది .అది పిల్లల్లో ఒక రకమైన భద్రతా భావాన్ని కలిగిస్తుంది .ఉమ్మడి కుటుంబాల్లో తాత' బామ్మలు పిన్ని '' బాబాయిలు వారి పిల్లల మధ్య పెరిగిన వారికి పరస్పరము ఇచ్చిపుచ్చుకునే లక్షణాలు శ్రద్ధ ఒకరిపై మరొకరికి ప్రేమానురాగాలు అవగాహన వంటివి అబ్బుతాయి. చిన్న కుటుంబాల్లో పెరిగే పిల్లలకు ఈలక్షణాలు ఉండవు.ఒంటరితనం ఇతరులతో కలిసిపోయే తత్వంఉండదు.ఉమ్మడి కుటుంభల్లో కనపడే బంధాలు అనురాగం వల్ల పిల్లల భావోద్వేగాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉమ్మడి కుటుంబాల్లో సవ్యంగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. జగడాలు సంఘర్షణ యొక్క సందర్భాలు తక్కువగా ఉంటాయి. సర్దుబాటు తత్వం రాజీ ధోరణి వుంటుంది. కుటుంబ వ్యవస్థలో పెద్ద పట్ల గౌరవం శ్రద్ధ ఉంటుంది.
ఒంటరి కుటుంబాలు _
నేర సంస్కృతి.
ప్రస్తుత ఒంటరి కుటుంబాలలో మమత మానవీయత' నైతిక విలువలు సహకారం' ప్రేమ 'దయ 'కరుణ జాలి 'అంతరించాయి. వ్యక్తుల్లోస భౌతిక వాదం పెరిగి స్వార్థ పూరిత మనస్తత్వం పగలు ద్వేశాలు పెరిగాయి . మనుష్యులు అంటే విలువ లేదు. మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. మానవీయ బంధాలు అంతరించి "మనీ" సంబంధాలే బంథాలైనాయి. (రాజ్యమేలుతున్నాయి) అధిక జనాభా, విలాస జీవనశైలి తమ సుఖ సంతోషాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే హింసా ప్రవృత్తి కుటుంబాల్లో పెరిగి నేర సంసృతి నెలకొనడం గమనార్హం ..
కౌన్సెలింగ్( మధ్యవర్తిత్వ) వ్యవస్థ లేకపోవడం.
.ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై స్వేచ్ఛా 'స్వతంత్ర కుటుంబాల సంఖ్య పెరిగింది . కుటుంబాలలో ఏర్పడే వివాదాలు' తగాదాలు తీర్చే పెద్దల కౌన్సెలింగ్ వ్యవస్థ లేదు. మధ్య వర్తిత్వం వహించే పెద్దలు వృద్ధులు ఓల్టేజ్ హోంల్లో ఉంటున్నారు. రాజీ కుదిర్చే వ్యవస్థ లేకపోవడం కుటుంబాలను కంట్రోల్ చేసే సామాజిక వ్యవస్థ లోపించడం వల్ల వ్యక్తుల ఇష్టాలకు ప్రాధాన్యత పెరిగింది.
ఉమ్మడి కుటుంబం _జాతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం.
ఉమ్మడి కుటుంబంలో పెద్దలు ఒకరి అవసరాలు ఒకరిపై శ్రద్ధ వహించడం భవిష్యత్తులో ఏ రకమైన ఆదా చేస్తే పిల్లలకు సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు ఉంటుందో ఆలోచించి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం జరుగుతుంది. మనదేశంలో దారిద్ర రేఖ కింద జీవిస్తున్న వ్యక్తి కూడా జీవనోపాధి గడుపుకునే మనిషి కూడా ముందుగా తమ సోదరి వివాహం అయిన తర్వాత తనుచేసుకోవాలని ఆలోచిస్తాడు. ఉమ్మడి కుటుంబం త్యాగాలకు పునాదులు.
నిర్వహణ నైపుణ్యం .
గృహనిర్వహణ కుటుంబ నిర్వహణ గొప్పకళ. అనుభవం వయసుతో నిర్వహణ కళ అబ్బుతుంది కుటుంబ బడ్జెట్ రూప కల్పన గొప్ప కళ అందరికీ లేకపోవడం వల్ల కుటుంబ వ్యవస్థ అతలా కుతలం అవుతుంది.
ఎవరికి వారే యమునా తీరే.
మెరుగైన మానవ సంభంందాలు సత్ ప్రవర్తన సచ్చీలత 'మర్యాధలు అవగాహన కుటుంబ విలువలు పాటించే పరిస్థితులు క్షిణిస్తున్నాయి. మొండిగా మొరటుగా ప్రవర్తిస్తున్నారు. నేను నాభార్య/భర్త నా పిల్లలు అనే సిద్దాంతం పోయి నాది నాదే అనే పాలసీ వచ్చింది. పిల్లలకు పెళ్లి కాగానే వేరు పడేయటం వేరు పడి సొంత ఇల్లు / అద్దె ఇల్లు తీసుకొని పెళ్లి చేసుకునే సంపూర్ణ స్వతంత్ర వ్యక్తుల సంఖ్య పెరిగపోవటం నూతన ఆచారమైంది. ఎవరికి వారే యమునా తీరే సంస్కృతి నెలకొంది.
విలువల క్షీణత.
కుటుంబ విలువలు,కట్టు బాట్లు ఇక ఉండవు. ఇష్టారాజ్యం రోజులు వచ్చాయి. అన్నా దమ్ములు, అన్నా చెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ళ, భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేనే లేవు. సమస్త మానవ సంబంధాల స్వభావ స్వరూపాలు మారిపోయి కుటుంబ పరువు 'ప్రతిష్టలు మసక బారుతున్నాయి. మనిషి తత్వం అంతరించి" మనీ"తత్వం పెరిగింది.
నెట్టింట బంధాలు.
ప్రపంచీకరణ 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 'డిజిటలీ కరణ విస్తరించి డిజిటల్ ప్లాట్ ఫామ్ పైన ఉన్నటువంటి నెట్టింట (ఇంటర్నేట్)బంథీయైన సంబంధ బాంధవ్యాలే తమకి నిజమైనవి అనే అపోహలో బతుకుతున్న జనం పెరిగి పోతున్నారు.
ఆన్లైన్ శ్రద్ధాంజలి
ఒక వ్యక్తి మరణిస్తే వాట్సాప్ లో 'ఫేస్బుక్లో ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టి అంతటితో వదిలేస్తున్నారు. తన శ్రద్ధాంజలి( సంతాపాన్ని) నలుగురి మధ్య ఘటించే ఓపిక లేకుండా బిజీ జీవనానికి అలవాటు పడటం శోచనీయం. మోయడానికి కూడా నలుగురు రాని పరిస్థితులు దాపురించాయి.
సామాజిక ఉద్యమం.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనానికి సమాజంలోని అన్ని వ్యవస్థలు సమాన బాధ్యతవహించాలి.ప్రభుత్వం నూతన విద్యా విధానం లో నైతిక విలువలు మానవీయ విలువలను పాఠ్యాంశంగాచేర్చాలి .పాఠశాల కళాశాల స్థాయిలో హిందూ సంస్కృతి 'ఆధ్యాత్మికత 'వేదాలు ఉపనిషత్తులు 'భగవద్గీత పారాయణం పట్ల విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఉమ్మడి కుటుంబం పవిత్రత ప్రాముఖ్యత పట్ల ప్రతి కుటుంబంలో చర్చించాలి .
కుటుంబాలలో వృద్ధులను వేధించడం మానుకోవాలి. వారిపై దాడులు చేయకూడదు. వృద్ధుల సంరక్షణ చట్టాలు సక్రమంగా అమలు జరగాలి .వృద్ధులను గౌరవించే సంస్కృతిని వాతావరణాన్ని
ప్రోత్సహించాలి.
పర్యావరణం విద్వంసం వల్ల జరిగే ఉపద్రవాల కన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనమైతే జరిగే సామాజిక ఆర్థిక ఉపద్రవాల గురించి మీడియా సినిమా ప్రచారం చెయ్యాలి. ప్రభుత్వం' స్వచ్ఛంద సామాజిక సంస్థలు ధార్మిక సంస్థలు మహిళా సంఘాలు యువజన సంఘాలు గ్రామ పంచాయితీలు సమిష్టిగా కృషి చెయ్యాలి . స్వాతంత్ర ఉద్యమ తరహాలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునర్జీవనానికి బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి.
మానవత్వం' ఆర్థత' విశాల హృదయం' సహనం 'మొదలైన భావాల స్ఫూర్తితో వసుదైక కుటుంబంకం నిర్మాణ ప్రక్రియలో సమాజం సంపూర్ణ బాగస్వామ్యమై ఉమ్మడి కుటుంబ పునర్జీవనానికి పునరంకితమౌతుందని ఆశిద్దాం.
(మే15'అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా)
నేదునూరి కనకయ్య
అద్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం
సామాజిక ఆర్థిక విశ్లేషకులు
ఫ్రీలాన్స్ రచయిత
హైదరాబాద్
9440245771
Comment List