రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మగారితో మర్యాదపూర్వకంగా
భేటీ అయిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలుపై గవర్నర్‌కు వివరించిన మంత్రి
హైదరాబాద్ :- రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ తో రెవెన్యూ,హౌసింగ్. సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం నాడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలు, మరియు ఇందిరమ్మ ఇండ్ల పధకం గురించి గవర్నర్ కి మంత్రిగారు సవివరంగా వివరించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ ఏడాది ప్రతినియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేస్తున్నామని వివరించారు.
గవర్నర్ ఆలోచన, ముఖ్యమంత్రి సూచనల మేరకు గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇండ్లను మంజూరు చేస్తున్నామని అలాగే ఐటిడిఎ పరిధిలో చెంచు కుటుంబాలకు పదివేల ఇండ్లను మంజూరు చేస్తున్నామని వివరించారు. మొదటిదశలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతాక్రమంలో ఇండ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. గవర్నర్ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుకుంట గ్రామం, గోగులపూడి, ఆదిలాబాద్ జిల్లా భుర్కి, మంగ్లీ , నాగర్ కర్నూల్ జిల్లా అప్పాపూర్ , బౌరాపూర్ గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు.
రాష్ట్రంలో గత పదేళ్లుగా నెలకొన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని గత నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశామని, ఈనెల 5వ తేదీ నుంచి 28 మండలాల్లో అమలు చేస్తున్నామని వివరించారు.ఎలాంటి రుసుము లేకుండానే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గవర్నర్ ని కలిసిన వారిలో ఐడిసి ఛైర్మన్ మువ్వ విజయబాబు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List