కాళేశ్వరంలో ఘనంగా ప్రారంభమైన సరస్వతి నది పుష్కరాలు

 కాళేశ్వరంలో ఘనంగా ప్రారంభమైన సరస్వతి నది పుష్కరాలు

లోక‌ల్ గైడ్ :
భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలను మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు. పుష్కరిణి వద్ద రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పుష్కరాలు ఈ రోజు నుంచి ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భక్తుల రాకపోకలకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాళేశ్వరం క్షేత్రంలో తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. ప్రతి రోజు సాయంత్రం 6:45 నుంచి 7:35 గంటల వరకు సరస్వతి నవరత్నమాల హారతి నిర్వహించనున్నారు. భక్తుల ఆనందార్థం కళా, సాంస్కృతిక కార్యక్రమాలూ ఏర్పాటు చేశారు.

భక్తులు తాత్కాలికంగా బస చేయడానికి టెంట్ సిటీ ఏర్పాటైంది. ఈ పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లను కేటాయించింది. తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్ వసతులు వంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

గురువారం సాయంత్రం 4:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకోనున్నారు. వారు పుష్కర స్నానాన్ని ఆచరించి, శ్రీ కాళేశ్వర మరియు ముక్తీశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకుంటారు. అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొంటారు.

అక్కడ ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీ దేవి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. భక్తుల కోసం నిర్మించిన 86 గదుల వసతి సముదాయాన్ని ప్రారంభించనున్నారు. కాళేశ్వరం పుష్కరాల్లో పాల్గొంటున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కావడం విశేషం.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News