మానవ సంబంధాలు - మారుతున్న మనుషులు
ఆప్యాయత, ఆత్మీయత-- మానవ సంబంధాల మూలాలు
నమ్మకం, ప్రేమ, ఆత్మీయత-- మానవ సంబంధాల సూత్రాలు
మానవ సంబంధాలు కాలంతోపాటు సమాజంలో సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి.
మార్పు అనేది సహజమైన ప్రక్రియ. మనుషుల ఆలోచన విధానాలు, జీవనశైలి, సాంకేతికతలో అభివృద్ధి, సామాజిక పరిస్థితులు, విలువలు ఇవన్నీ మానవ సంబంధాలపై అధిక ప్రభావం చూపుతాయి. నాడు కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించేవారు. కుటుంబ పెద్ద చెప్పినట్టుగా కుటుంబ సభ్యులందరూ కూడా నడుచుకునేవారు ప్రేమ, ఆప్యాయతలకు ఆదర్శంగా నాడు కుటుంబాలు ఉండేవి. వ్యక్తిగత ఆలోచనలకు ఎక్కడ చోటు ఉండేది కాదు ఏ నిర్ణయాలు తీసుకున్న కుటుంబ పెద్ద కుటుంబ సభ్యులతో చర్చించి సమిష్టిగా చక్కని నిర్ణయాలు తీసుకొని కుటుంబాభివృద్ధికి కుటుంబ సభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా నిత్యం ప్రయత్నం చేసేవాడు. నాడు సాంకేతిక రంగం అంతా అభివృద్ధి చెందినప్పటికీ కూడా కుటుంబ పెద్దలు చెప్పే మంచి విషయాలను గ్రామంలో అందరూ పాటించేవారు గ్రామంలో జీవించే ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించేవారు ఎలాంటి ద్వేషాలు ఆ రోజుల్లో మనుషుల మధ్యన ఉండేవి కావు. ఆస్తుల కన్నా మనుషుల ప్రేమాభిమానాలే ముఖ్యంగా భావించేవారు ఒకరినొకరు గౌరవించుకుంటూ మానవ సంబంధాలను బలంగా మార్చుకునేవారు ఆనాటి కుటుంబ వ్యవస్థలో ఉండే మనుషులు. నేడు కుటుంబ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది ఆర్థిక సంపాదనే లక్ష్యంగా మానవత్వాన్ని మరిచిన మనుషులు చిన్న కుటుంబాలు ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు.
వేడు మానవ సంబంధాలు కూడా మారుతున్నాయి. ఈ మార్పులు మన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవనానికి ఎలా ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవడం అవసరం.నేటి సాంకేతిక యుగంలో మానవ సంబంధాలు పెను ప్రమాదకర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
ముఖ్యంగా నేడు యువత మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాలో మునిగి
నిజ జీవిత సంబంధాలను మరచిపోతున్నాం. ఒకప్పుడు ముఖాముఖి సంభాషణకు ప్రాధాన్యం ఉండేవి,కానీ ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం కోసమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.ఆధునిక జీవన రీతిలో పని ఒత్తిడి,స్పర్థ, లక్ష్య సాధన కోసం వెచ్చించే సమయం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కేటాయించే సమయం తగ్గిపోతుంది.
మనస్ఫూర్తిగా చర్చలు, సహనంతో కూడిన సంభాషణలు తగ్గుముఖం పడుతున్నాయి.
మునుపటి తరాల్లో కుటుంబ బంధాలు ప్రధానమై ఉండేవి.కానీ ప్రస్తుతం వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత ప్రాధాన్యత ఎక్కువగా పెరిగింది. దీనివల్ల కుటుంబ సంబంధాలు కాస్త నీరసించాయి.
స్నేహం స్వార్థం మధ్య సరిహద్దు పురాతన కాలంలో స్నేహం పక్కింటి వారి నుండి మొదలై దగ్గర బంధాలుగా ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్ స్నేహాలు ఎక్కువ, కానీ అవి ప్రామాణికత లోపిస్తున్నాయి.
నిజమైన స్నేహితులను కనుగొనడం కష్టమవుతోంది.
సంబంధాలను కేవలం సందేశాలకే పరిమితం చేయకుండా,వ్యక్తిగత కలయికకు వేదికగా ఉపయోగించాలి.
కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రతిరోజూ కాస్త సమయం కేటాయించాలి.సంబంధాల్లో నిజాయతీ,విశ్వాసం, పరస్పర గౌరవం వంటి విలువలను పునరుద్ధరించాలి.సంబంధాల పట్ల మన దృక్కోణం మారుతున్నదా? అనే విషయంపై ఆలోచించాలి.
మానవ సంబంధాలు మారుతున్నప్పటికీ,వాటిని బలోపేతం చేయడం మన చేతుల్లోనే ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన విలువలను,సమయాన్ని, సాంకేతికతను సమతూకంగా వినియోగిస్తే, సంబంధాలు మరింత బలపడతాయి. ఇప్పటికైనా మనుషులు మానవత్వంతో మెలిగితే కుటుంబ బంధాలు పదిలంగా ఉంటాయి. తమ పిల్లలకు కుటుంబ బంధాల, కుటుంబ విలువల గురించి ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని చెపుతూ ఉండాలి. అప్పుడే భవిష్యత్ తరానికి కావలసిన ఉత్తమ పౌరులను తయారు చేసిన వారమవుతాం. ఆస్తులు అంతస్తులు కోసం ఎప్పుడు ఆలోచించకుండా మంచి మనసు గల మనుషులుగా మానవత్వంతో బంధాలను, బంధుత్వాలను ,స్నేహాన్ని స్నేహ బంధాన్ని, మనిషి విలువను, దేశం, సమాజం యొక్క స్థితిగతులను అర్థం చేసుకుంటూ ఉత్తమ పౌరులుగా మంచి సమాజ నిర్మాణం కోసం ప్రతి వ్యక్తి బలమైన మానవ సంబంధాలను ఏర్పరచుకోవాలి.
సమాజ పురోగతికి మనుషులందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పైన ఉన్నది. బంధాలు బాగుంటేనే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది.ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని బాధ్యతగా బంధాలను బలంగా మార్చుదాం. మానవత్వాన్ని బ్రతికిద్దాం.
🙏🏻🙏🏻
వ్యాసకర్త
వి. జానకి రాములు గౌడ్
లింగంధన
Comment List