నేటి నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభం
లోకల్ గైడ్ :
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్ శనివారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పునఃప్రారంభ షెడ్యూల్ ప్రకారం మిగిలిన 13 లీగ్ మ్యాచ్‌లను బీసీసీఐ ఆరు వేదికలపై నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.యాదృచ్ఛికంగా అయినా సరే, మొదటి మ్యాచ్‌లోనే తలపడిన డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్లు మళ్లీ రీస్టార్ట్ మ్యాచ్‌లోనూ ఢీకొనడం విశేషం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనున్న వేళ, గత రెండు రోజులుగా అక్కడ వర్షాలు పడుతుండటంతో వర్షం ముప్పు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.ఈ నెల 27న లక్నో-బెంగళూరు మ్యాచ్‌తో లీగ్ దశ ముగియనుండగా, మే 29న క్వాలిఫయర్ 1, 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ జరగనున్నాయి. పునఃప్రారంభానికి అనంతరం జరిగే మ్యాచ్‌ల్లో చీర్ లీడర్స్, డీజేలు లేకుండా టోర్నీ నిర్వహించే వార్తలు వచ్చినా, దీనిపై బీసీసీఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు.పాత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను కొత్త షెడ్యూల్‌లో ఢిల్లీలోకి మార్చడం సన్‌రైజర్స్ అభిమానులను నిరాశకు గురిచేసింది.
ఎక్కడ ఆగామంటే..
మే 8న ధర్మశాల వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 10.1 ఓవర్ల తర్వాత వర్షం కారణంగా ఆగిపోయింది. ఇదే సమయంలో సీజన్ వాయిదా పడగా, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీ తలా 16 పాయింట్లతో అగ్రస్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ (15 పాయింట్లు), ముంబై (14), ఢిల్లీ (13) రేసులో కొనసాగుతున్నాయి. కోల్‌కతా, లక్నో మాత్రం మరో ఓటమితో ఎలిమినేషన్‌కు చేరే అవకాశంలో ఉన్నాయి.
శనివారం కేకేఆర్‌ను ఓడించినట్లయితే బెంగళూరు 18 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది. ముంబైకి ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా, ఒకటి ఓడినా వారి ఆశలు తగ్గిపోతాయి. ధర్మశాలలో ఆగిన పంజాబ్–ఢిల్లీ మ్యాచ్ తిరిగి పూర్తి మ్యాచ్‌గా నిర్వహించనున్నారు.
అందరి చూపు కోహ్లీ వైపే...
ఐపీఎల్ రీస్టార్ట్ తర్వాత జరిగే తొలి పోరులో కోల్‌కతా మరియు బెంగళూరు తలపడనున్న ఈ మ్యాచ్‌లో అందరి దృష్టీ విరాట్ కోహ్లీ పైనే ఉంది. ఇటీవలే టెస్టులకు వీడ్కోలు తెలిపిన కోహ్లీకి ఇది రిటైర్మెంట్ తర్వాత తొలి మ్యాచ్. దీంతో ఈ పోరు కోహ్లీకి మాత్రమే కాదు, బెంగళూరు అభిమానులకు కూడా ఎంతో భావోద్వేగంగా ఉండనుంది.
కోహ్లీకి ట్రిబ్యూట్‌గా ఆర్‌సీబీ అభిమానులు తెలుపు రంగు టీషర్ట్స్ ధరించి స్టేడియానికి రానున్నారు. ఫలితంగా చిన్నస్వామి స్టేడియం మొత్తం శ్వేత వర్ణంలో మెరిసిపోనుంది.
Comment List