ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు:
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
నిర్మల్, లోకల్ గైడ్:
ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పట్టణంలోని నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం నుంచి ప్రారంభమైన ఐదు రోజులపాటు ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఉపాధ్యాయుడు ఉత్తమ బోధకుడిగా ఎదిగితేనే విద్యార్థులు విజేతలుగా మారగలరన్నారు. బోధనా నైపుణ్యాలు మెరుగుపడితే పఠన, లెక్కింపు, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాలు విద్యార్థుల్లో పెరుగుతాయన్నారు. పాఠశాల దశ నుండే విద్యార్థుల్లో లక్ష్య నిర్ధారణ అలవాటు చేయాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన బోధన పద్ధతులను అవలంబించాలన్నారు. ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలని సూచించారు. ఐదు రోజుల శిక్షణ తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ పి. రామారావు, విద్యాశాఖ అధికారులు వి. నర్సయ్య, లింబాద్రి, జిల్లా ఉపాధ్యాయ శిక్షణ నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List