పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం – అప్రమత్తమైన భారత సైన్యం
పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దును పూర్తిగా సీల్ చేయగా, అనుమానాస్పదంగా వ్యవహరించే వారిపై కాల్చివేయాలన్న ఉత్తర్వులు జారీచేశారు. భారత వాయుసేన ఇప్పటికే అప్రమత్తమై, మే 9వ తేదీ వరకు జోధ్‌పూర్, బికనేర్, కిషన్‌గఢ్ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసింది. గగనతలంలో యుద్ధవిమానాల గస్తీ కొనసాగుతున్నదీంతో పాటు మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను కూడా యాక్టివ్ చేశారు.పంజాబ్‌లో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్‌పుర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, అమృత్‌సర్, గురుదాస్‌పూర్, తార్న్ తరన్ ప్రాంతాల్లో 72 గంటలపాటు పాఠశాలలను మూసివేశారు. పోలీసు శాఖతోపాటు ఇతర భద్రతా బలగాల్లో సెలవులు రద్దు చేసి, సిబ్బందిని తక్షణమే విధుల్లోకి పిలిపించారు.జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాక్ దళాలు శతఘ్ని గుండ్లతో కాల్పులకు తెగబడ్డాయి. పౌర ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకున్న ఈ కాల్పులకు భారత సైన్యం సమర్ధంగా ప్రతిస్పందిస్తోంది. ఇప్పటి వరకు ఒక జవాన్‌తో పాటు 13 మంది మరణించారు. మంగళవారం రాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం ఘాటుగా ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపలకి ప్రవేశించి, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, సుమారు 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పహల్గాం దాడికి ఇది గట్టి ప్రతికారం కావడం గమనార్హం.
Comment List