బిలాస్‌పూర్‌లో బ్లాక్‌ఔట్ విధింపు – రాత్రివేళ వాహనాల రాకపోకలకు నిషేధం
బిలాస్‌పూర్: భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం పాక్‌లోని ముష్కర స్థావరాలపై దాడులు జరిపింది. దీని ప్రతిగా పాకిస్తాన్ వరుసగా భారత పట్టణాలు, సైనిక స్థావరాలపై క్షిపణుల దాడులకు పాల్పడుతోంది.ఈ పరిస్థితుల నేపథ్యంలో, పంజాబ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్ నుంచి దాడుల ముప్పు ఉండవచ్చన్న ఉద్దేశంతో జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్ కుమార్ పూర్తి స్థాయి బ్లాక్‌ఔట్‌ను ప్రకటించారు.రాత్రి సమయంలో ప్రజలు ఇంటా బయట ఎలాంటి విద్యుత్ దీపాలు వెలిగించకూడదని, అన్ని ఇన్‌డోర్ మరియు ఔట్‌డోర్ లైట్లు ఆర్పేయాలని సూచించారు. రాత్రివేళల్లో వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సురక్షితంగా ఇండ్లలోనే ఉండాలని, అత్యవసర కారణాలు లేనంతవరకు ప్రయాణాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇలా బ్లాక్‌ఔట్ ద్వారా వైమానిక దాడుల ముప్పు నివారించగలమని, భద్రతా బలగాల తక్షణ స్పందనకు ఇది సహాయపడుతుందని జిల్లా మేజిస్ట్రేట్ వెల్లడించారు. ఇప్పటికే ఉనా జిల్లాలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేశామని అధికారులు తెలిపారు.
Comment List