పగడ్బందీగా ధాన్యం సేకరణ
నిజామాబాదు ,లోకల్ గైడ్ :
ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు .
కేంద్రాల వద్ద అధికారులు అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని ధోబీఘాట్, కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ధాన్యం అమ్మకాల వివరాలతో కూడిన రసీదులు అందిస్తున్నారా అని ఆరా తీశారు. ధోబీఘాట్ వద్ద గల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో ఒకింత జాప్యం జరుగుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా, కేంద్రం నిర్వాహకుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నప్పటికీ ధాన్యం సేకరణలో ఎందుకు జాప్యం జరుగుతోందని నిలదీశారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి తావిచ్చే సొసైటీలకు వచ్చే సీజన్ లో కేంద్రాలను కేటాయించకూడదని కలెక్టర్ పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడద్దని అన్నారు . కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యాతా ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంటదివెంట నిర్దేశిత మిల్లులకు తరలించాలని, లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మిల్లుల వద్ద మిల్లర్లు సకాలంలో ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. సూపర్ అమాన్ రకం ధాన్యం దిగుమతి చేసుకునేందుకు పలువురు మిల్లర్లు విముఖత ప్రదర్శిస్తున్నారని కేంద్రాల నిర్వాహకులు తెలుపగా, మిల్లర్లతో సమావేశమై ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్ అన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తూ దాదాపుగా తుది దశకు చేర్చారని అన్నారు . ఇదే స్పూర్తితో పని చేస్తూ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరపాలని హితవు పలికారు. ఆలస్యంగా పంట దిగుబడులు చేతికి అందిన అన్ని ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, పంట విక్రయం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, డీపీఎం సాయిలు తదితరులు ఉన్నారు.
Comment List