వడదెబ్బ నివారణపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు 

 వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

వడదెబ్బ నివారణపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు 

వికారాబాద్, లోక‌ల్ గైడ్:

జిల్లా లో వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని  ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  తెలిపారు.
మండుటెండల వల్ల జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని అన్నారు. వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల జిల్లా అధికారులు వడదెబ్బ నివారణపై వారివారి శాఖల ప్రణాళికకు అనుగుణంగా వేసవి తీవ్రత సమయంలో చేయవలసినవి, చేయకూడనివి వాటి గురించి క్షేత్రస్థాయిలో ప్రతి నివాస ప్రాంతంలో ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని,  తప్పనిసరిగా ప్రజలు జాగ్రత్తలు పాటించేలా విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు.వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సాధారాణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతూ, తీవ్రమైన వేడిమితో కూడిన ఎండలు ఉన్నందున ప్రజలు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం సమయంలో వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా తలకు టోపీ ధరించడం, తువ్వాలు చుట్టుకోవడం, చేనేత వస్త్రాలు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ వేడిమి సమయాలలో సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోకూడదని, చల్లదనాన్ని అందించే నీడ ప్రదేశాలలో ఉండాలని అన్నారు. సాధారణ సమయాలకంటే వేసవిలో ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకోవాలని, తేలికపాటి కాటన్ వస్త్రాలను ధరించడం వంటివి చేయాలని, త్వరగా వడదెబ్బకు లోనయ్యే స్వభావం కలిగిన వారు విధిగా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.  ఆయా కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సముదాయాలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వేసవి తీవ్రత వల్ల వడదెబ్బకు లోను కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఉపాధి హామీ కార్మికులు ఉదయం వేళలోనే పనులు చేసేలా, పని ప్రదేశాలలో తప్పనిసరిగా నీడనిచ్చేలా షామియానాలు, తాగునీటి వసతి అందుబాటులో ఉండే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుందని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీ.హెచ్.సీలలో వైద్యాధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ, వడదెబ్బ నివారణ ఔషధాలు సరిపడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఎవరైనా వడదెబ్బకు గురైతే, వెంటనే వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే, తక్షణ చికిత్స చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News