ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

*జులై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలి
*ప్రతి పాడి పశువుకు ఆర్.ఎఫ్.ఐ.డి. ట్యాగింగ్ కల్పించాలి
*ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సమీక్షించిన జిల్లా కలెక్టర్
లోకల్ గైడ్: ఖమ్మం:
ఇందిరా మహిళా డెయిరీ క్రింద జూలై 15 తర్వాత ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్లు గ్రౌండ్ చేసేలా ప్రణాళిక రూపకల్పన చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్, తన క్యాంపు కార్యాలయంలో ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పాడి రైతులకు పశువుల యూనిట్ గ్రౌండింగ్, ప్రస్తుతం ఎన్ని యూనిట్లు చేయాలి, ఎక్కడి నుండి కొనుగోలు చేయాలి వంటి పలు అంశాలపై కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పాడి పశువుల కొనుగోలు ప్రక్రియ వర్షాకాలం జూలై 15 తర్వాత ప్రారంభించాలని అన్నారు. ప్రతి నెలా ఎన్ని పాడి పశువులు కొనుగోలు చేయాలో ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు. జూలై 15 నుంచి జనవరి వరకు 5 వేల యూనిట్ల పాడి పశువులను గ్రౌండ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.ఇందిరా మహిళా డెయిరీ సభ్యత్వం ఉన్న మహిళల్లో అనుభవం ఉన్న పాడి రైతులను గుర్తించామని, వీరిని భాగస్వామ్యం చేస్తూ పశువులు ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు.ప్రతి వారం ఎక్కడి నుండి పాడి పశువులు కొనుగోలు చేయాలి, ఏ లబ్ధిదారులకు అందించాలి పకడ్బందీ షెడ్యూల్ రూపొందించాలని అన్నారు. మనం కొనుగోలు చేసే ప్రతి పాడి పశువు ఆరోగ్యం స్థితిగతులు ముందుగానే పరీక్షించాలని, ప్రతి పాడి పశువుకు ఆర్.ఎఫ్.ఐ.డి. ట్యాగింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. పాడి పశువులకు అవసరమైన మేత కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, వీటి తయారీ కోసం నిరుపయోగంగా ఉన్న అసైన్డ్ ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని పశువుల మేతకు అవసరమైన గడ్డి పెంపకానికి వినియోగించాలని తద్వారా పేద బలహీన వర్గాల రైతులకు కూడా ఆదాయం లభిస్తుందని అన్నారు. పాడి పశువుల మేత తయారు చేసేందుకు ఆసక్తి గల రైతులను గుర్తించి వారి భూములలో ఇతర పంటలు సాగు చేయకుండా అక్కడ పశువుల మేతను సాగు చేసేలా చూడాలని అన్నారు. ప్రతి గ్రామంలో నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు భూమి గుర్తించాలని అన్నారు. పాడి రైతులకు రవాణా ఖర్చుతో సహా అంచనా వేస్తూ తక్కువ ధరకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రస్తుతం 2 పాడి పశువులు ఉన్న లబ్ధిదారులకు మరో రెండు పశువులు అందించేందుకు ఎంపిక చేసే పక్షంలో వారికి షెడ్డు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. ప్రతి పాడి పశువుకు బీమా కల్పించేలా ప్రణాళిక తయారు చేయాలని అన్నారు.పాడి పశువు, రవాణా, భీమా ఖర్చు ఎంత అవుతుందో పరిశీలించి వివరాలు అందించాలని, వీటి ప్రకారం యూనిట్ కాస్ట్ నిర్దేశించి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు. పాల ఉత్పత్తి వ్యాపారం, పశువుల కేర్ పై ఏపిఎం, డిపిఎం, సంబంధిత ఎంపీడీఓ లకు అవసరమైన శిక్షణ అందించాలని, రాబోయే వారం నుంచి వీటిని ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరా మహిళా డెయిరీ ద్వారా రెండు రోజులలో పాడి రైతులకు చెల్లింపులు చేసేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. బీఎంసి, కలెక్షన్ పాయింట్ల ఏర్పాటుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. మన దగ్గర నుంచి విజయ డెయిరీ తప్పని సరిగా ఎంత పాలు కొనుగోలు చేస్తుందో స్పష్టమైన వివరాలతో ఒప్పందం చేసుకోవాలని అన్నారు. మన పరిసర ప్రాంతాలలో పాల డిమాండ్ ఎంత ఉంది, ఎక్కడ సరఫరా చేయొచ్చు వంటి అంశాలను పరిశీలించి మార్కెటింగ్ ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, ఎస్సి కార్పొరేషన్ ఇడి నవీన్ బాబు, మైనార్టీ సంక్షేమ అధికారి డా. పురందర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు..
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List