ఇప్పట్లో బీజేపీ అధ్యక్ష ఎంపిక లేనట్లే!
(జె. తిరుపతి చారి)
హైదరాబాద్, లోకల్ గైడ్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవీ ఇప్పుడు కమలదళానికి చిక్కుముడిలా మారింది. రాష్ట్ర నాయకులు చాలా మంది అధ్యక్ష పదవీ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎవరికి పదవీ వరిస్తోందోననేది ఇప్పట్లో తేలేలా లేదు. 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 5 నెలల మందు జూలై 4న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ నుంచి అనాడు బండి సంజయ్ ను తప్పించి ఆయన స్థానంలో జీ కిషన్ రెడ్డిని నియమించింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది నియోజకవర్గాల్లో జెండా ఎగురవేసింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ 8 ఎంపీ స్థానాల్లో కాషాయపు జెండా రెపరెపలాడింది. ప్రధాని మోదీ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించారు. కానీ బీజేపీ అంతకుముందు నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చడంపై పార్టీలోనే కాదు, ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. సీఎంగా బీసీ చేసే ఆలోచన ఉన్న ఆ పార్టీ జాతీయ నాయకత్వం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెడ్డి సమాజిక వర్గానికి చెందిన నేతను ఎందుకు ఎంపిక చేశారు అంటూ ప్రతిపక్షాలు కమలం పార్టీని ఎండగట్టాయి. బండి సంజయ్ తను రాష్ట్ర పార్టీ చీఫ్ గా కొనసాగిన కాలంలో పార్టీకి ఊపుతెచ్చారనేది కాదనలేని వాస్తవం. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీని, ఆనాటి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కడిగిపారేశారు. కాంగ్రెస్ పార్టీని కూడా తీవ్ర స్థాయిలో తూర్పారాబట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 48 కార్పొరేట్ డివిజన్ లలో విజయం సాధించి బీజేపీ సత్తా చాటేలా బండి పనిచేశారు అని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
కానీ బండి సంజయ్ ను మార్చిన తర్వాత కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ పరంగా ముందుకు వెళ్తున్నప్పటికీ కొత్త అధ్యక్షుడి నియమాకం జరగాలి. ఈ మేరకు జాతీయ నాయకత్వం కూడా అధ్యక్ష ఎంపికకు సంబంధించి శోభ కరందులను నియమించింది. ఈమె నియమాకం జరిగి నెలలు గడుస్తున్న దీనికి సంబంధించిన అడుగు కూడా ముందుకు సాగలేదు. ఒకవైపు పార్టీ కేంద్ర నాయకత్వం అధ్యక్ష ఎంపికను చేస్తామని చెబుతున్న ఆ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఇప్పట్లో రాష్ట్ర చీఫ్ ఎంపిక ఉంటుందా? ఉండదా? అనే విషయాలపై స్పష్టత లేదు. ఇక ఇదిలా ఉంటే... తెలంగాణ అధ్యక్ష పదవీ కోసం చాలా మంది నేతలు విశ్వప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో మరోసారి బండి సంజయ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పార్టీ నిబంధనల ప్రకారం 10 సార్లు సాధారణ సభ్యులుగా, మూడు సార్లు క్రియశీల సభ్యులుగా ఉన్న వారికే బీజేపీ అధ్యక్ష పదవీని ఇస్తారని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు పార్టీ చీఫ్ రేసులో ఉన్నవారిలో అరవింద్ కుమార్, ఈటెల రాజేందర్, రామచందర్ రావు, డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా ఉన్నారు.
పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షాలు తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేకతను చాటుకునేలా, వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మరికొంత కాలం అధ్యక్ష బాధ్యతల్లో జీ కిషన్ రెడ్డినే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పోటీ పడుతున్న నేతలు తమదైన శైలిలో పార్టీలో ఉనికికి చాటుకునేందుకు వారు తమ ముందు అన్ని అవకాశాలను వాడుకుంటున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకు బీజేపీ పార్టీ అధ్యక్ష ఎంపిక సంబంధించిన కార్యక్రమాలు మొదలు కాలేదు. ప్రసిడెంట్ ఎలక్షన్ ఇంఛార్జిగా ఉన్న శోభ నామిషన్ల స్వీకరణను మొదలు పెట్టలేదు. అలాంటప్పుడు అధ్యక్ష ఎంపికకు మరో ఎనిమిది నెలల నుంచి ఏడాది కాలం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఎవరి ప్రయత్నాలు ఏలా ఉన్నా... గతంలో పార్టీకి ఊపు తెచ్చిన బండి సంజయ్ పేరు ప్రధానంగా వినిపిస్తుండటం ఒక అంశంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే... తమకు బాధ్యతలు ఇస్తే 2028 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలో తీసుకు రావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, ఖర్చు ను కూడా కొంత మేరకు మేమే భరిస్తామని రాష్ట్ర నాయకుల్లోని ముఖ్యులు అధినాయకత్వం చెవిలో వేసినట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో... ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ను, సీఎం రేవంత్ రెడ్డిని, అదేవిధంగా బీఆర్ఎస్ ను, మాజీ సీఎం కేసీఆర్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే వారికే బీజేపీ రాష్ట్ర చీఫ్ గా అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Comment List