కాళేశ్వర..ముక్తేశ్వర ఆలయం..
కాళేశ్వర..ముక్తేశ్వర ఆలయం..
- దక్షిణ కాశీగా పేరుపొందిన ఆలయం
- ముక్తేశ్వర ఆలయంలో ముక్కోటి దేవతలు..
- గోదావరి ప్రాణహిత సరస్వతిల త్రివేణి సంగమం - లోకల్ గైడ్ తెలంగాణ, మహాదేవ్ పూర్
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం 1982లో మొదటిసారి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ జరిగిన సమయంలో ఇక్కడ మహా కుంభాభిషేకం నిర్వహించారు. అంతటి ప్రసిద్ధి చెందిన ఆలయం గురించి ప్రత్యేక కథనం..
ఆలయ విశిష్టత...
గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని, కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.
ముక్తేశ్వరస్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం.
కాలేశ్వరంలో..త్రివేణి సంగమం..
త్రివేణి సంగమం గంగ, యమున, సరస్వతి నదుల సంగమంగా ప్రసిద్ధి పొందింది. అయితే, సరస్వతి నది ప్రస్తావన పురాణాల్లో ఉంది. కానీ అక్కడ సరస్వతి నది కనిపించదు. అది అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుందని పండితుల మాట.
ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి, ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. పునర్జన్మ నుంచి ముక్తి పొందడమే మోక్షంగా హిందువులు భావిస్తారు.
సాధారణంగా రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. అదే మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటారు. సంగమ స్నానాన్ని, ముఖ్యంగా త్రివేణి సంగమ స్నానాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తుంటారు.
సరస్వతీ పుష్కరాలు...
సరస్వతి పుష్కరాలు - 2025 మే 15 నుండి 26 మే 2025 మొత్తం 12 రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం 35 కోట్లతో శాస్వత నిర్మాణాలను చేపట్టింది. ఈ పుష్కరాలకు మన తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఛత్తీస్ గడ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది
Comment List