టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధం – యువ జట్టుకు ఎదురు సవాళ్లు!
టీమిండియా ఇంగ్లండ్ పర్యటన త్వరలో ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్‌ల సుదీర్ఘ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు సన్నద్ధమవుతోంది. ఈ సిరీసుతోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025–27 సైకిల్ మొదలవుతుండటంతో భారత క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబర్చుతున్నారు. అయితే బజ్‌బాల్ విధానంలో దూకుడుగా ఆడే ఇంగ్లండ్ జట్టు పేస్ పిచ్‌లపై బలంగా కనిపిస్తోంది. మరోవైపు, భారత జట్టు యువతరాన్ని ఆశ్రయిస్తోంది. దీంతో ఈ సిరీస్‌లో టీమిండియాకు ఎదురయ్యే కీలక సవాళ్లు ఏమిటో చూద్దాం.
మిడిల్ ఆర్డర్ గందరగోళంప్రస్తుతం ప్రకటించిన జట్టులో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్ లాంటి ఆరుగురు ఓపెనర్లు ఉన్నారు. దీంతో మిడిల్ ఆర్డర్ కూర్పుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్లను తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయం వినిపిస్తోంది. రిషబ్ పంత్, నితీశ్ రెడ్డి, జడేజా, ధ్రువ్ జురేల్ లాంటి ఆటగాళ్లు ఉన్నా... శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడు నాలుగో స్థానానికి అవసరమన్న అభిప్రాయం బలంగా ఉంది.
అనుభవం కొరత, మార్గనిర్దేశం అవసరం
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ అనుభవం తక్కువగా ఉండడం, స్వింగ్ బంతులపై అతడి అస్తవ్యస్త ఆటతీరు ఎప్పటినుంచో చర్చకు విషయమవుతోంది. రోహిత్, విరాట్ టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత పుజారా, రహానే లాంటి అనుభవజ్ఞులను జట్టులోకి తీసుకుంటారని అభిమానులు భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం కొత్త రక్తానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం జడేజా ఒక్కరే సీనియర్ ఆటగాడు. కెఎల్ రాహుల్, బుమ్రా ఉన్నా, వారు ప్రతి మ్యాచ్‌లో అందుబాటులో ఉంటారన్న గ్యారంటీ లేదు. కరుణ్ నాయర్, సాయి సుదర్శన్లకు ఉన్న టెస్టు/కౌంటీ అనుభవం జట్టుకు బలాన్నిచ్చే అంశాలు కావచ్చు.
ఇంగ్లండ్ దాడికి తట్టుకోగలరా?
బజ్‌బాల్ ధోరణిలో ఆడే ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి మన బౌలింగ్ సవాలుగా మారనుంది. పేస్ పిచ్‌లపై స్పిన్‌కి ఎంత సహకారం ఉంటుందో అనుమానమే. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌లో లేడు, షమీ అందుబాటులో లేడు. సిరాజ్ స్థిరత్వం లేకపోవడం సమస్యగా మారుతోంది. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ కృష్ణ, ఆకాశ్ దీప్ లాంటి బౌలర్ల ప్రదర్శన కీలకంగా మారనుంది. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్నర్లు పేస్ పిచ్‌లపై ఎంతవరకు ప్రభావం చూపుతారో వేచి చూడాలి. ఇక జడేజా అయితే, ఒత్తిడిలో ధీరుగానే ఆడాలని ఆశించాల్సిందే.విశ్వ ఛాంపియన్‌షిప్‌లో గెలుపు ప్రారంభం కావాలంటే, ఈ యువ భారత జట్టు అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది – అనుభవజ్ఞుల కొరత, స్థిరమైన బ్యాటింగ్ కూర్పు, బౌలింగ్ లోపాలు అన్నీ కలిసివస్తున్న వేళ, శుభ్‌మన్ గిల్ నేతృత్వానికి ఇది పెద్ద పరీక్షే!
Comment List