మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే జారే
లోకల్ గైడ్ అశ్వారావుపేట : ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఏఎస్ఆర్ నగర్ పేరాయిగూడెం ఫైర్ కాలనీలలో ఉపాధి హామీ నిధులు ఒక కోటి ముప్పై రెండు లక్షల తొంబై వేలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. అనంతరం కన్నాయిగూడెం గ్రామపంచాయతీ ఎమ్మెల్యే దత్తత గ్రామమైన చెన్నాపురంలో ఉపాధి హామీ నిధులు ఒక కోటి ఏడులక్షల ఇరవై వేలతో నిర్మించిన సిసి రోడ్లు సిసి డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఈ నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించటం జరుగుతుందని దానికి అనుగుణంగా ఈరోజు రెండు కోట్ల నలభై లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు సీసీ డ్రైనేజీలకు ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందన్నారు. గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అందులో భాగంగానే మారుమూల గిరిజన గ్రామమైన చెన్నాపురాన్ని దత్తత తీసుకుని అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అందించే సంక్షేమ పథకాలను చక్కగా సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా అతికొద్ది రోజుల్లోనే నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇందిర మహిళాశక్తి కార్యక్రమం ద్వారా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొంది పోడు సాగు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇందిర సౌర గిరి వికాస్ పథకం ద్వారా నూరు శాతం సబ్సిడీతో సోలార్ పంప్ సెట్లు బోర్లు, మోటర్లు అందిస్తామని పామాయిల్ పంట సాగు చేసేలా ప్రోత్సహించి, రాయితీల ద్వారా ఎరువులు బిందు సేద్యం పరికరాలు అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అందించటం కొరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ పాఠశాలలు హాస్టళ్లలో పౌష్టిక ఆహారం అందించటం కోసం నూతనంగా మెనూ అందిస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ చదువు విలువ తెలుసుకొని ఉన్నత చదువులు చదవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారు మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా వారి వారి కుటుంబాలను సంరక్షించుకోవాలన్నారు. రాబోయే మూడున్నర సంవత్సరాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ పథకాలు అందిస్తుందన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాలలో నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా మహిళా ఉద్యోగినులను ఘనంగా సన్మానించారు. పర్యటనలో భాగంగా గిరిజనుల ఆరాధ్య దైవమైన గుబ్బల మంగమ్మ అమ్మవారిని దర్శించి రాష్ట్ర ప్రజలు పాడిపంటలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కృష్ణప్రసాద్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ శ్రీరామమూర్తి, పంచాయతీరాజ్ డీఈ శ్రీధర్, ఏఈ ఎం అక్షిత, ఆర్ డబ్ల్యు ఎస్ డీఈ సలీం, ఏఈ సతీష్, మండల స్పెషల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ టి కృష్ణ, ఆర్ అండ్ బి డీఈ ప్రకాష్, ఏఈ రాకేష్, మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, మండల నాయకులు జూపల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Comment List