మళ్ళీ రాబోతున్న కరోనా మహమ్మారి....
లోకల్ గైడ్ :
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి తన ప్రభావాన్ని చూపుతోంది. ఆసియాలోని కొన్ని దేశాల్లో కొత్త కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ఆరోగ్యశాఖలు అప్రమత్తమయ్యాయి.ప్రస్తుతానికి హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అనేక నమూనాలు పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. 2024లో ఇంతమంది కరోనా పాజిటివ్‌గా తేలిన ఘటన ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. మే 3తో ముగిసిన వారం నాటికి 31 మంది కొవిడ్ వల్ల మరణించగా, ఇది ఈ ఏడాది గరిష్ఠం అని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల కొవిడ్ దశలతో పోలిస్తే కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ, వైరల్ లోడ్ మాత్రం పెరుగుతున్నట్లు పేర్కొన్నారు.ఇక సింగపూర్‌లోనూ కరోనా పుంజుకుంటోంది. దాదాపు ఏడాది తర్వాత తొలిసారిగా మే నెలలో కేసులు గణనీయంగా పెరగగా, మే 3 నాటికి కేసుల సంఖ్య అంచనాలను మించిపోతూ 28 శాతం పెరిగింది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 14,200కి చేరుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య సైతం సుమారు 30 శాతం పెరిగింది. అలాగే థాయ్‌లాండ్, చైనా దేశాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్లు సమాచారం.
ఇది జనాభాలో తగ్గుతున్న రోగనిరోధక శక్తికి సంకేతంగా పరిగణించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లోని ఆరోగ్య శాఖలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. జనం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
Comment List