భారత్ ఆసియా కప్ 2025 నుంచి వైదొలగబోతుందా? బీసీసీఐ కీలక నిర్ణయం
లోకల్ గైడ్:
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ భారత్, భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2025లో జరిగే ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి టీమ్‌ఇండియా వైదొలగనుందని పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ACC)కి భారత క్రికెట్ బోర్డు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో, సెప్టెంబర్‌లో జరగాల్సిన పురుషుల ఆసియా కప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్‌ఇండియా పాల్గొనకపోవచ్చని అంచనా. అలాగే, జూన్‌లో జరగనున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా భారత్ తప్పుకుంటుందని సమాచారం. అయితే, ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రస్తుతం ACCకి పాకిస్థాన్ క్రీడా మంత్రి మరియు పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షత వహిస్తున్నారు. "పాకిస్థాన్ నేతృత్వంలోని ఏసీసీ ఈవెంట్లలో భారత జట్లు పాల్గొనవు. ఇది దేశపు సెంటిమెంట్‌తో కూడిన నిర్ణయం. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలిగే విషయాన్ని మౌఖికంగా ACCకి తెలియజేశాం. భవిష్యత్తులో కూడా ACC టోర్నీల్లో పాల్గొనకుండా ఉండే అవకాశముంది," అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పాక్ క్రికెట్‌ను అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా చేయాలనే వ్యూహం ఉండవచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ టోర్నీలకు ఎక్కువ స్పాన్సర్లు భారత దేశానికి చెందినవారే కావడంతో పాటు, భారత్ లేకుండా ఆసియా కప్‌కు ప్రసారకర్తలు ఆసక్తి చూపే అవకాశాలు తక్కువే. అందువల్ల టోర్నీ నిర్వహణలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.2024లో ఆసియా కప్ ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా దక్కించుకుంది. ఎనిమిదేళ్లకు 170 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం ఉంది. అయితే, భారత్ వైదొలిగితే టోర్నీ రద్దయ్యే అవకాశమూ లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.గతంలోనూ 2023 ఆసియా కప్ టోర్నీలో పాక్ ఆతిథ్యమిచ్చినప్పటికీ, బీసీసీఐ శ్రీలంకలో టీమ్‌ఇండియా మ్యాచ్‌లను నిర్వహించేలా ఒప్పందం కుదిర్చింది. భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లు జరగని పరిస్థితిలో, ACC టోర్నీల నుంచీ భారత్ తప్పుకోవడం ఆసియా క్రికెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Comment List