ఆపరేషన్ సిందూర్...... రక్షణ శాఖకు బడ్జెట్ రూ.50 వేల కోట్ల పెంపు!
లోకల్ గైడ్ :
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. కేంద్ర బడ్జెట్‌లో రక్షణ శాఖకు రూ.50,000 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. “ఆపరేషన్ సిందూర్” నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రక్షణ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా, తాజా ప్రతిపాదనకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు రక్షణ బడ్జెట్ రూ.7 లక్షల కోట్లను దాటే అవకాశముంది.చైనా, పాకిస్థాన్‌ల నుంచి వస్తున్న భద్రతా సవాళ్ల నేపథ్యంలో, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.6,81,210 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఇది గతేడాది కేటాయించిన రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే 9.53% అధికం కాగా, సవరించిన అంచనాల అయిన రూ.6.41 లక్షల కోట్ల కంటే 6.2% ఎక్కువ. తాజా బడ్జెట్‌లో కొత్త ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు పెద్దపీట వేయడమేకాక, రక్షణ ఖర్చు జీడీపీలో 1.91%గా ఉండనుంది.ఈ అదనపు రూ.50,000 కోట్ల నిధులను పరిశోధన, ఆయుధాలు, అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగించే అవకాశముందని తెలుస్తోంది. 2014-15లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన సమయంలో రక్షణ బడ్జెట్ రూ.2.29 లక్షల కోట్లుగా ఉండగా, మొత్తం బడ్జెట్‌లో దాదాపు 13% రక్షణ రంగానికే కేటాయించారు.ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంకు సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన కాల్పుల ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులను సమీపం నుంచి కాల్చి హత్య చేశారనీ, దానికి ప్రతిగా భారత్ "ఆపరేషన్ సిందూర్" పేరుతో పీఓకే, పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిందని వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత పాక్ రెచ్చిపోయిన చర్యలు తీసుకున్నా, భారత్ ధాటికి తట్టుకోలేక వెనక్కి తగ్గడంతో చివరకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
Comment List