ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలి
- జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు.
గద్వాల, లోకల్ గైడ్:
ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ రికార్డ్స్ ను, స్టేషన్ పరిసరాలను, పోలీస్ స్టేషన్ లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం తగిన ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్ణాటక నుండీ కృష్ణానదికి వరద వస్తున్నందున నది తీర గ్రామ ప్రజలను నదిలోకి వెళ్లకుండా అప్రమత్తం చెయ్యాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్టాఫ్ కు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలలో పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలన్నారు. తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మూడ నమ్మకాలు, బాల్య వివాహాల పై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comment List