లైసెన్స్ సర్వేయర్లకు కిట్ల పంపిణీ
గద్వాల, లోకల్ గైడ్ :
లైసెన్స్ సర్వేయర్లకు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ కిట్లను అందజేశారు. మంగళవారం ఐడీఓసీ తమ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శిక్షణ పొందుతున్న లైసెన్స్ సర్వేయర్లకు అదనపు కలెక్టర్ శిక్షణ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భూమి హక్కుల రికార్డులను పారదర్శకంగా నిర్వహించేందుకు లైసెన్స్ సర్వేయర్లను ప్రారంభించిందని పేర్కొన్నారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ప్రాక్టికల్ పనితీరులో నైపుణ్యం కలిగి ఉండేందుకు, ఈ కిట్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో థియరీతో పాటు ఫీల్డ్ ట్రైనింగ్ ఉన్నందున అభ్యర్థులు కష్టపడి నేర్చుకోవాలని సూచించారు. భూభారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వంటి ప్రక్రియల్లో సర్వే మ్యాప్‌లు తప్పనిసరిగా ఉండడంతో, గ్రామీణ ప్రాంతాల్లో లైసెన్స్‌డ్ సర్వేయర్ల ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు పరీక్ష,అనంతరం లైసెన్స్‌డ్ సర్వేయర్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఏ.డి.రామ్ చందర్, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List