పని గంటలను పెంచనివ్వం: - సీఐటీయూ
జోగులాంబ గద్వాల జిల్లా, (లోకల్ గైడ్):
అమెరికాలోని చికాగో నగరంలో చిందిన కార్మిక వర్గం రక్తం సాక్షిగా కార్మికుల పని గంటల్ని పెంచకుండా చివరి వరకు పోరాడతామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ అన్నారు. గురువారం 139 మేడే సందర్భంగా గద్వాల పట్టణంలోని హమాలీలు, మున్సిపల్ వర్కర్స్, ఎలక్ట్రీషియన్, దాన ఫ్యాక్టరీ సివిల్ సప్లై హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆశా కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికాగో వీరుల త్యాగ ఫలితమే ప్రస్తుత 8 గంటల పని దినాలన్నరు. నేడు కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని దినాల స్థానంలో 12 గంటల పని దినాలు పెంచుతున్నారని విమర్శించారు. దేశంలో శతకోటీశ్వర్ల సంఖ్య పెంచడానికి సంపదని కేంద్రీకరించడానికి కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పనిగంటల పెంపునకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తున్నదని విమర్శించారు. కార్మిక వర్గానికి ఏటువంటి సామాజిక భద్రత చర్యలు చేపట్టకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా, పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా కార్మిక వర్గాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. శ్రమ జీవులకు అండగా వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేదాక ఎర్ర జెండా అండగా ఉంటుందని అన్నారు. ఒక వైపు పని దినాలు పెంచి మరో వైపు లేబర్ కోడ్ ల రూపంలో నూతన చట్టాలు తీసుకువచ్చి కార్మిక వర్గ ప్రజాతంత్ర హక్కులను అణచి వేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. చివరి వరకు కార్మికులకు అండగా పని గంటల పెంపుకు వ్యతిరేకంగా పోరాడతామని అన్నారు. కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం లేబర్ కోడ్ కు వ్యతిరేకంగా మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలో కార్మికులతో ర్యాలీ నిర్వహించారు
అంతకు ముందు సీఐటీయూ కార్యాలయానికి వచ్చిన ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జిల్లా కార్మిక శాఖ అధికారి వేణుగోపాల్, కార్మికుల సమస్యలు తెలుసుకొని చట్టాల గురించి తెలియజేశారు. చట్ట పరిధిలో ఏటువంటి సమస్యలు ఉన్న న్యాయ సదన్ ద్వారా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.కోటేశ్, పట్టణ అధ్యక్షుడు రామ కృష్ణ, ఎలక్ట్రీషియన్ అధ్యక్షులు గోపి, సీఐటీయూ మండల కన్వీనర్ రాజేష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శివ, రవి, హమాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాలు రంగన్న, VOA ల సంఘం మండల అధ్యక్షులు తిమ్మప్ప, గౌరవ అధ్యక్షుడు వెంకట్రామయ్య, ఆశా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పద్మ, సునీత పారిశుధ్య కార్మికులు సువార్త మల్లమ్మ, సంతోషమ్మ, 108 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బిచుపల్లి, LIC యునియన్ అధ్యక్షులు రంగారావు, సివిల్ సప్లై హమాలీ, కార్మికుల సంఘం నాయకుడు శివ, తదితరులు పాల్గొన్నారు.
Comment List