ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత ఆక్రందన?
15 రోజులు దాటినా కొనే దిక్కులేదు!
కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాల లేమి!
అటువైపు తిరిగి చూడని సంబంధిత అధికారులు!
వర్షా ప్రభావంతో మరింత ఆందోళనకు గురవుతున్న రైతాంగం!
సన్నాలకే ప్రభుత్వం మొగ్గు, లావులు ఆలస్యమట!
కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు!
ఇది అశ్వారావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి!
లోకల్ గైడ్ అశ్వారావుపేట : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేని పరిస్థితి నెలకొంది అశ్వారావుపేట మండల పరిధిలోని ఊట్లపల్లి అశ్వారావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఒకవైపు ప్రభుత్వం ఊదరగొడుతున్నా, స్థానిక అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లుగా రైతు అరిగోస పెట్టే విధంగా వీరి చర్యలు ఉంటున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. 15 రోజులు నుండి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చినప్పటికీ కొనుగోలు చేయకుండా రైతును క్షోభకు గురి చేస్తున్నారని, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు వర్ష ప్రభావం వల్ల ఏడవ తేదీ వరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, అయినప్పటికీ అధికారులు చొరవ చూపించే పరిస్థితి లేకుండా ఉందని, వర్షాలు పడితే పంటను కాపాడుకోవడం ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందని త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మండు వేసవి కాలంలో దాన్యం వద్ద 15 రోజులుగా కాపలా ఎలా ఉండగలమని, కనీస సౌకర్యాలు కూడా లేవని, వర్షం వస్తే పంటను కాపాడుకోవడం కోసం టార్ఫాలిన్ పట్టాలు కూడా లేవని, ఆర్పాలిన్ పట్టాలు అద్దెకు తీసుకువస్తే ఒక్కో రైతుకు 5000 ఖర్చు వస్తుందని, ఇదంతా ఎవరూ భరించాలి అని రైతులు అరిగోస పెడుతున్నారు. దీనికి తోడు ధాన్యం క్వింటాకు రెండున్నర కేజీలు తరుగు క్రింద తీస్తున్నారని, ఆరుకాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడం కోసం మరింత కష్టపడాల్సి వస్తుందని, ప్రభుత్వం రైతంగాన్ని ఆదుకుంటున్నామని ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అవి బుట్ట దాఖలవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అశ్వారావుపేట, ఊట్లపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్కరి ధాన్యం కూడా కొనలేదని, ఈరోజే కొనుగోలు ప్రారంభించారని 15 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద మకాం పెట్టుకుని కాపలా ఉంటున్నామని రైతులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఊట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆ భూమి యజమానులకు అద్దె డబ్బులు చెల్లించనందున కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించుటకు నిరాకరించడంతో కొనుగోలు కేంద్రాన్ని మరొక ప్రాంతానికి మార్చారని, నిన్న కురిసిన వర్షాలకు ఆ ప్రదేశం అంతా బురద మయం అవడంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందని, వారం నుంచి కొనుగోలు కేంద్రంలో ఉన్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. దాన్యం లోడింగ్ కు వచ్చే లారీలు సైతం అక్కడ బురదలో ఇరుక్కుపోయే పరిస్థితి ఉందని, అటువంటి నష్టాలు కూడా రైతాంగం మీదే రుద్దుతారని రైతులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతాంగం తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి టార్పాలిన్ పట్టాలను ప్రభుత్వమే సరఫరా చేయాలని, కానీ వర్షాల బారిన పడుతున్న కానీ ఒక్క టార్పాలిన్ పట్టా కూడా రైతాంగానికి అందజేయలేదని దీంతో రైతులే బయట ప్రైవేటు వ్యక్తుల వద్ద టార్పాలిన్ పట్టాలు అద్దెకు తీసుకువచ్చి పంటను కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు తమ ఆవేదన వెళ్లబోసుకుంటున్నారు. టార్పాలిన్ పట్టాలు అడిగినా కానీ అధికారులు స్పందించే పరిస్థితి లేదని కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు తిరిగి చూసే పరిస్థితి కూడా లేదని రైతాంగం విమర్శిస్తున్నారు. అంతేకాకుండా సన్న ఒడ్లు మాత్రమే కొంటామని లావులు వేరే ప్రాంతానికి తరలించాలని చెప్తూ కాలయాపన చేస్తున్నారని, ఈ ప్రాంత మిల్లుల్లో సన్న వడ్లు మాత్రమే కొంటారని, ఆ విధంగా ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని, ఇక్కడ మిల్లులు వారు లావులు సేకరించే పరిస్థితి లేదని, అవి దూర ప్రాంతాల్లో ఉన్న వేరే మిల్లులకు వెళ్తాయని, దానికి సమయం పడుతుందని తమ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ రైతులను ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈనెల 7వ తేదీ వరకు వర్ష సూచనలను వాతావరణ శాఖ ప్రకటించిందని అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదని, ప్రభుత్వ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకొని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, టార్పాలిన్ పట్టాలను అందుబాటులో ఉంచాలని, క్వింటాకు తరుగు తీయకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై అశ్వారావుపేట సొసైటీ సీఈవో మానేపల్లి విజయబాబును వివరణ కోరగా తేమశాతం రానందున, కొంత హమాలీల వలన, కొంత వర్షం కారణంగా కొనుగోలు ఆలస్యం అయిందని, రెండు మూడు రోజుల్లో రైతుల ధాన్యం అంతా కొనుగోలు చేయబడుతుందని తెలిపారు. సన్న రకాలు వెంటనే కాటాలు వేసి కొనుగోలు చేయడం జరుగుతుందని, లావు రకాలు కూడా లక్ష్మీనగరం, ఇల్లందుకు పంపిస్తామని, అవి కూడా వెంటనే కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. ఊట్లపల్లిలో గతంలో దాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన స్థలానికి అద్దెలు చెల్లించామని, ఇప్పుడు స్థలం దొరకనందున ఊరు బయట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని రెండు మూడు రోజుల్లో కొనుగోలు పూర్తవుతుందని వారు తెలిపారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ను వివరణ కోరెందుకు ఫోన్లో ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.
Comment List