ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ ముఖ్య అధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులు పుణ్య స్నానాలకు వచ్చే సమయంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. భక్తులు కాళేశ్వరం ఆలయం, పుష్కర ఘాట్లు, చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యాలను గగనతలం నుంచి వీక్షించేందుకు ‘జాయ్‌రైడ్’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందులో ఒకేసారి 6 మందికి ప్రయాణించే అవకాశం ఉన్న ఎయిర్‌బస్ హెచ్-125 మోడల్ హెలికాప్టర్‌ను వినియోగించనున్నారు. ఒక్కో టికెట్ ధర రూ.4,500గా నిర్ణయించగా, ప్రయాణ సమయం సుమారు 6–7 నిమిషాలు ఉంటుంది.హెలికాప్టర్ సేవల నిర్వహణ బాధ్యతను బెంగళూరుకు చెందిన ఓ సంస్థకు అప్పగించగా, అవసరమైన సాంకేతిక అనుమతులన్నింటినీ ఆ సంస్థే పొందింది. ఉదయం నుండి సూర్యాస్తమయం వరకూ ఈ జాయ్‌రైడ్ సేవలు అందుబాటులో ఉంటాయి.
Comment List