తాత, ముత్తాతలు సంపాదించిన భూములను ధరణి భూతం కొల్లగొట్టింది
కేసీఆర్ ఎన్ని దొంగ ఏడ్పులు ఏడ్చినా మా అభివృద్ది ఆగదు.
భూ భారతితో యాజమాన్య హక్కులలో తప్పుల సవరణ
ఇంతవరకు 3400 దరఖాస్తుల స్వీకరణ
ఆగస్టు 15 నాటికి భూ సమస్యలకు పరిష్కారం
రెవెన్యూ, హౌసింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
లోకల్ గైడ్ : ధరణి చట్టాన్ని తెచ్చి పేదలను, సామాన్యులను ఏడిపించిన కేసీఆర్‌కు ప్రజలు రెండు సార్లు శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినందుకు దుఃఖం వస్తుందేమోనని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. తండ్రులు, తాతలు ముత్తాతలు సంపాదించిన భూములను ధరణి భూతం కొల్లగొట్టిందని దుయ్యబట్టారు.బి.ఆర్.ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పేదల ఆస్తులను ధరణిని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలను కొల్లగొట్టిన ఆనాటి పెద్దలు కనీసం పశ్చాత్తాపం పడడం లేదని విమర్శించారు.ఏదో పోయినట్లు, ఏదో జరిగినట్లు దుఃఖమొస్తుందని కపట ప్రేమ వొలకబోశారు. కేసీఆర్ కన్నీరు మున్నీరుగా దుఃఖించినా సరే, పేద ప్రజలకు చేయాల్సిన సేవ , అభివృద్ది చేసుతీరుతామని స్పష్టం చేశారు.కామారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోని షెట్పల్లి, ఉరుసుగట్టు , సుర్దేపల్లిలో మంగళవారం నాడు నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులలో మంత్రిగారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తరతరాల నుండి సాగుచేస్తున్న భూ యజమానులకు పాసు పుస్తకాలు జారీచేయడం, తప్పులుగా నమోదు చేసిన పేర్లు సరిచేయడం, నిషేధిత భూములు విషయంలో తప్పులు సరిచేయడం వంటి అంశాలు భూ భారతి చట్టంలో ఉన్నాయన్నారు. సామాన్య ప్రజలకు అర్ధయ్యే విధంగా భూ భారతి చట్టం తయారు చేయడం జరిగిందని, చట్టం తో పాటు రూల్స్ తయారు చేయడం జరిగింది. భూ భారతి 2025 చట్టం ప్రజలకు అర్థమయ్యే విధంగా, 18 రాష్ట్రాలు పర్యటించి 9 నెలలపాటు మేధో మధనం చేసి అధికారులు, మేధావుల సలహాలతో రూపొందించడం జరిగింది. గత ప్రభుత్వం 2020 సంవత్సరంలో తీసుకువచ్చిన చట్టంలో నిబంధనలు లేవు. భూ భారతి చట్టం 50 సంవత్సరాల పాటు మనుగడలో ఉంటుంది. . ఈ చట్టం గురించి అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని 4 జిల్లాల్లోని ఒక్కో మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సదస్సులు నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యలపై దరఖాస్తులు తీసుకోవడం జరుగుతోంది. అందులో భాగంగానే ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని లింగంపేట్ మండలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటివరకు 20 గ్రామాలలో సదస్సులు నిర్వహించి 3400 కు పైగా అభ్యర్థన దరఖాస్తులు తీసుకోవడం జరిగింది.భూముల రిజిస్ట్రేషన్ , భూసమస్యల పరిష్కారానికి సంబంధించి తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్డీఓ కు అప్పీలు చేసుకునే విధంగా, ఆర్డీఓ ఇచ్చిన తీర్పులో అన్యాయం జరిగితే కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరం ఉంటే సిసిఎల్ ఆపై ల్యాండ్ ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. అధికారులు తప్పులు చేస్తే చర్యలుతప్పవని అన్నారు. రాష్ట్రంలో 10956 గ్రామాలకు త్వరలో గ్రామ రెవిన్యూ అధికారులను నియమించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 1000 మంది సర్వేలను నియమించడం జరుగుతుందని తెలిపారు. లింగంపేట్ మండలంలోని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. భూములు సర్వే చేసి పాస్ బుక్కులో ఎక్కించడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 15 నాటికి అన్ని మండలాల్లో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పర్యటనలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా సదస్సులో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వరంగల్ పట్టణ పరిధిలోని బి. ఆర్ . నగర్‌లోని సింగరబోయిన అనిల్‌కుమార్, యల్లమ్మ దంపతుల ఇంట్లొ సన్నబియ్యంతో తయారుచేసిన మధ్యాహ్నభోజనం స్వీకరించి శాలువతో సత్కరించి రూ. 5000 నగదు బహుమతిని అందజేశారు.
Comment List