లోకల్ గైడ్ బెజ్జంకి జూన్ 22:
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజా సమస్యలను పక్కనపెట్టి తన అనుచరుల పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఐ జిల్లా నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.సోమవారం ఆయన మాట్లాడుతూ, అంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి వస్తున్న కొత్త కెనాల్ కాలువ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల పరిధిలోని అనేక గ్రామాలకు ఈ కాలువ పూర్తయితే తాగునీరు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అయితే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాలువలో తట్టెడు మట్టిని కూడా తొలగించలేదని విమర్శించారు.ప్రస్తుతం ప్రాంతంలో తాగునీరు, సాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో కాలువల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. దీంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని అన్నారు.జిల్లా కేంద్రం సిద్దిపేటకు బెజ్జంకి మండలం నుంచి వెళ్లేందుకు సరైన రహదారులు లేక ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. పోతారం–వడ్డూరు రహదారి, బేగంపేట–చీమలకొండపల్లి–కొండాపూర్ రహదారి,బేగంపేట–తాళ్లపల్లి రహదారులు కంకర మట్టి రోడ్లుగా ఉండటంతో ప్రయాణికులు ప్రమాదాలు జరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.రానున్న వర్షాకాలంలో ఈ రహదారుల పరిస్థితి మరింత దారుణంగా మారి ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.మండలంలో అభివృద్ధి పనులు జరగడం లేదని, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.ఇప్పటికైనా ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న కాలువ, రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రూపేష్‌తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.