- District News
- Khammam
- వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎ...
వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి. పంట అవశేషాల దహనాన్ని పూర్తిగా నివారించాలి. సాగునీటి లభ్యతపై రైతులకు ముందస్తు సమాచారం అందించాలి.
జిల్లాలో వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బుధవారం ఇరిగేషన్, హార్టికల్చర్, వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* నానో యూరియా ప్లస్ వినియోగంపై రైతుల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియా వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
వరి కోతల అనంతరం పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా పంట అవశేషాలను కాల్చినట్లయితే జరిమానాలు విధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పొలాల్లో మంటలు పెట్టడం వల్ల అవి అదుపు తప్పి చెట్లు, పక్కనే ఉన్న పంటలు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు తదితర ఆస్తులకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని, ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులను పప్పు ధాన్యాలు, ఆయిల్ పామ్, కూరగాయలు, తదితర ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు పంట మార్పిడి విధానం, యూరియా వినియోగాన్ని తగ్గించే పద్ధతులపై క్రమం తప్పకుండా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
గ్రామాల వారీగా బోర్‌వెల్ ఆధారంగా సాగు చేసే రైతులు, కాలువలపై ఆధారపడి, బోర్ల ద్వారా సాగు చేసే రైతులు, చివరి ఆయకట్టు రైతులను ముందుగానే గుర్తించాలని సూచించారు. తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో వీరు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున బోర్‌వెల్ ఆధారంగా వరి సాగు చేయడం రైతులకు లాభసాటిగా ఉండదని పేర్కొన్నారు.
చివరి ఆయకట్టు ప్రాంతాల రైతులను ప్రత్యేకంగా మ్యాపింగ్ చేసి స్థానిక సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల భాగస్వామ్యంతో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
అనంతరం సాగునీటి సరఫరా, తదితర అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సాగునీటి లభ్యతపై రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ, హార్టికల్చర్, ఇరిగేషన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
