- District News
- గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం.
గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం.
గుండె ఆరోగ్యమే.. సంపూర్ణ ఆరోగ్యానికి పునాది
లోకల్ గైడ్/తాండూర్:
మనిషి ప్రాణాన్ని నిలబెట్టే అత్యంత కీలకమైన అవయవాల్లో గుండె ప్రధానమైనది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని నిరంతరం సరఫరా చేస్తూ మన జీవన ప్రక్రియను కొనసాగించే గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచించారు.
గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు హృదయ సంబంధ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తాండూరు పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఎంఏ అధ్యక్షుడు డా. జయప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డా. జయప్రసాద్ మాట్లాడుతూ.. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, పొగతాగడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని తెలిపారు.
గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఉప్పు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించి పండ్లు, కూరగాయలు, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పొగతాగడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడంతో పాటు శరీర బరువును నియంత్రించుకోవాలన్నారు. రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయులను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని సూచించారు.
ఛాతీలో నొప్పి లేదా బిగుతు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక చెమటలు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే హృదయ సంబంధ వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చన్నారు.
ప్రజలు తమ గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు, సమాజంలోనూ ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం కల్పించాలని వైద్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్, ట్రెజరర్ జైదీప్ రెడ్డి, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
