- District News
- చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్.
చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్.
సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల గుర్తింపు - తాండూర్ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు.
లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్‌లో ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తాండూర్ సబ్ డివిజన్ డిఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. ఈ ఘటనపై క్రైం నంబర్ 294/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 331(4), 305 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టు మందు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.ఇందుకు సంబంధించి
పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి....సెప్టెంబర్ 13న ఫిర్యాదుదారుడి భార్య రేష్మ బేగం తన తల్లి ఊరైన సేడంకు వెళ్లారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో ఫిర్యాదుదారుడు ఇంటికి తాళం వేసి భార్యను తీసుకురావడానికి సేడంకు వెళ్లారు. అనంతరం ఇద్దరూ కోణార్క్ రైలులో తాండూర్‌కు తిరిగి వస్తుండగా, ఫిర్యాదుదారుడు తన మొబైల్‌లో ఇంటి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇంటి ముందు వైపు ఉన్న కెమెరా బ్లర్‌గా కనిపించడంతో బ్యాకప్ పరిశీలించగా రాత్రి 11.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంటి పరిసరాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు.
సెప్టెంబర్ 14న తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు ఇంటికి చేరుకున్న దంపతులకు గేటు తాళం అలాగే కనిపించినప్పటికీ, ఇంటి ప్రధాన తలుపు తాళం విరగగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. అందులో ఉన్న సుమారు రెండు తులాల బంగారు నెక్లెస్, 20 తులాల వెండి పట్టీలు, 19 తులాల చిన్నారుల వెండి కడియాలు, కొంత నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేయగా... సెప్టెంబర్ 29న ఉదయం 10 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు తాండూర్ బస్టాండ్ సమీపంలో A-1 నుంచి A-3 వరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.
పోలీసుల విచారణలో A-1, A-2 గతంలో పలు దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లినట్లు, జైలులోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం A-2 ద్వారా A-3 కూడా A-1కు పరిచయం కావడంతో ముగ్గురూ కలిసి దొంగతనాలకు పాల్పడేందుకు పథకం వేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు స్పష్టం చేశారు.
