- District News
- Khammam
- అప్పాయిగూడెం అభివృద్ధికి దండు ప్రవీణ్ పక్కా ప్లాన్
అప్పాయిగూడెం అభివృద్ధికి దండు ప్రవీణ్ పక్కా ప్లాన్
జీపీ మ్యాప్, వనరుల మ్యాప్‌తో గ్రామాభివృద్ధికి కార్యాచరణ.. ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు అవగాహన
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 28 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం అప్పాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ దండు ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి పనుల ప్రణాళిక, జీపీ మ్యాప్–వనరుల మ్యాప్ రూపకల్పనతో పాటు ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామ అవసరాలకు అనుగుణంగా గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అంశాలను వివరించారు. రహదారులు, నీటి వనరులు, సాగుభూములు, ప్రభుత్వ ఆస్తులు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర వనరులను గుర్తించి మ్యాప్‌లో నమోదు చేయడం ద్వారా గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో రూపొందించుకోవచ్చని తెలిపారు. గ్రామంలోని నీటి వనరులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు, సమస్యాత్మక ప్రాంతాలు, ఇతర వనరుల వివరాలను ప్రజలు తెలియజేసి జీపీ మ్యాప్, వనరుల మ్యాప్ రూపకల్పనలో చురుకుగా భాగస్వాములు కావాలని కోరారు. అదేవిధంగా ఒక్కసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణం, పారిశుద్ధ్యానికి కలిగే నష్టాలను వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగ వస్తువులను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దండు ప్రవీణ్, కార్యదర్శి కృష్ణవేణి, ఉప సర్పంచ్ ఎట్టి సంధ్యారాణి, బీఎఫ్‌టీ వసంత్, ఎఫ్‌ఏ సాయమ్మ, మేట్ అజ్మీరా సురేష్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
