- District News
- కష్టపడి బతికే కార్మికుడికి కన్నీటి కష్టాలు!
కష్టపడి బతికే కార్మికుడికి కన్నీటి కష్టాలు!
లారీ కొనుగోలు పేరుతో రూ.18 లక్షల మోసం.. రోడ్డున పడ్డ కుటుంబం - నమ్మకమే శాపమై జీవనాధారం కోల్పోయిన బాధితుడు. - రేక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. - ఎనిమిది నెలలుగా లారీ కోసం ఎదురుచూపులు. - ఇద్దరూ వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు.
లోకల్ గైడ్ /తాండూర్:
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ లారీ యజమానికి తీరని కష్టం వచ్చిపడింది. లారీ కొనుగోలు చేస్తామని నమ్మించి ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని తీసుకెళ్లి, ఆ తర్వాత డబ్బులు చెల్లించకపోగా లారీకి ఉన్న సిమెంట్ ట్యాంకర్, 16 కొత్త టైర్లను విక్రయించారని బాధితుడు ఆంధ్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.18 లక్షల విలువైన లారీని కోల్పోయి, జీవనాధారం లేక కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. తనకు న్యాయం చేయాలని తాండూర్ పోలీసులను వేడుకుంటున్నాడు.
విజయవాడకు చెందిన ఆంధ్రయ్య గత 20 సంవత్సరాలుగా తాండూర్ పట్టణంలోని సీసీఐ కాలనీలో నివాసముంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి జీవనాధారంగా ఉన్న సిమెంట్ ట్యాంకర్ లారీని 2026 ఫిబ్రవరి నెలలో తాండూర్‌కు చెందిన ప్రకాష్ రెడ్డి, బాచుపల్లి గ్రామానికి చెందిన అశోక్ అనే ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినట్లు బాధితుడు తెలిపాడు. లారీ కండిషన్‌ను మెకానిక్‌తో తనిఖీ చేయించాలని చెప్పి, తాండూర్ పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్ వద్ద నుంచి వాహనాన్ని తీసుకెళ్లారని పేర్కొన్నాడు.
అయితే లారీని తీసుకెళ్లి ఎనిమిది నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయలేదని, తనకు ఎలాంటి డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పైగా లారీని పూర్తిగా విక్రయించడంతో పాటు, దానికి చెందిన 16 సీల్ టైర్లను సైతం అమ్మేశారని ఆరోపించాడు.
ఎనిమిది నెలలుగా తప్పించుకుంటూ.
లారీని తీసుకెళ్లిన తర్వాత తన వాహనం గురించి ప్రకాష్ రెడ్డిని పలుమార్లు ఫోన్ ద్వారా అడిగానని ఆంధ్రయ్య తెలిపాడు. ప్రతిసారీ రేపు ఇస్తానని, మరో రెండు రోజులు సమయం పడుతుందని చెబుతూ కాలయాపన చేశారని పేర్కొన్నాడు. చివరకు తనకు అనుమానం రావడంతో అక్టోబర్ 2న తాండూర్ పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని, ఎఫ్‌ఐఆర్‌లో ప్రకాష్ రెడ్డిని ఏ1గా, అశోక్‌ను మరో నిందితుడిగా పేర్కొన్నారని బాధితుడు వెల్లడించాడు.
రూ.18 లక్షల నష్టం.. కుటుంబ పోషణ భారంగా మారింది.
లారీనే తన కుటుంబానికి జీవనాధారమని, దానిని కోల్పోవడంతో సుమారు రూ.18 లక్షల నష్టం వాటిల్లిందని ఆంధ్రయ్య కన్నీటిపర్యంతమయ్యాడు. కష్టపడి సంపాదించుకున్న వాహనం లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టంగా మారిందని వాపోయాడు. తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని బాధితుడు తెలిపాడు. అతని ఆవేదన కష్టపడి బతికే ఓ సాధారణ వ్యక్తి జీవితం ఒక్కసారిగా ఎలా సంక్షోభంలో పడిందో తెలియజేస్తోంది.
కౌన్సిలర్ అండ ఉందంటూ బాధితుడి ఆరోపణ.
ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రకాష్ రెడ్డి, అశోక్‌లకు తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఓ కౌన్సిలర్ అండగా నిలుస్తూ, తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆంధ్రయ్య ఆరోపించాడు. తనకు ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు సంబంధిత వ్యక్తులే బాధ్యత వహించాలని ఆవేదన వ్యక్తం చేశాడు.
పోలీసులపైనే బాధితుడి ఆశలు.
తాండూర్ పోలీసులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆంధ్రయ్య తెలిపాడు. తనకు జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని, లారీ విలువైన రూ.18 లక్షలను తిరిగి ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరాడు. తన లారీని తీసుకెళ్లి విక్రయించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
తనలాంటి మరో వ్యక్తి మోసపోకుండా ఉండాలంటే ఈ ఘటనలో న్యాయం జరగాలని కోరుతున్నాడు. ఒక లారీని కోల్పోవడం అంటే అతనికి కేవలం ఆస్తి నష్టం మాత్రమే కాదు.. కుటుంబాన్ని పోషించే ఆధారాన్ని కోల్పోవడం కూడా. కష్టపడి బతికే ఓ సాధారణ వ్యక్తికి జరిగిన ఈ నష్టంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
