హనుమకొండ లో రైస్ మిల్లర్ల మహా ధర్నా..
వెంటనే డిమాండ్లు పరిష్కరించాలి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్11
హనుమకొండ,
ఉమ్మడి వరంగల్ జిల్లా డిస్టిక్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లు హనుమకొండ ఏకశిలా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట సంపత్ కుమార్ మాట్లాడుతూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ అకస్మిక దాడులను వెంటనే నిలిపివేసి రెండు నెలల నుండి అన్యాయంగా రన్నింగ్ మిల్లర్ల పైన వేసిన కేసులను బెషరతుగా ఉపసంహరించుకొని
మిల్లర్లతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని అన్నారు. సీమ అగ్రిమెంట్ నిరూపక్షాలకు ఆమోదయోగంగా ఉండేలా రూపొందించి గతంలో ప్రభుత్వం చేసిన ఓటీఆర్ టెస్టు మిల్లింగ్ ప్రకారం కర్ణాటక సైంటిస్టుల రిపోర్టు ప్రకారంగా మాత్రమే బియ్యం తీసుకోవాలి అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బియ్యం రికవరీ శాతాన్ని నిర్ణయించాలని, క్వింటాల్ ధాన్యానికి మిల్లింగ్ ఛార్జీలను రా బియ్యానికి రూ.150, బాయిల్డ్ బియ్యానికి రూ.200కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పాత గన్నీ బ్యాగ్ ధరను రూ.9గా నిర్ణయించడంతో పాటు పాత సంచులపై 20 శాతం తరుగుదలను తగ్గించాలని కోరారు.2014 నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ మిల్లింగ్, ట్రాన్స్‌పోర్ట్, డ్రైయేజ్, కస్టోడియన్ ఛార్జీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డిఫాల్ట్ మిల్లర్లపై విధించిన 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీని రద్దు చేయాలని కోరారు. 2022-23 రబీ టెండర్ ధాన్యం ధరను న్యాయంగా నిర్ణయించి, అప్పటి గోదాము, హమాలీ, హ్యాండ్లింగ్ ఛార్జీలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయి డిఫాల్ట్ అయిన మిల్లర్ల లెక్కలను పూర్తిగా తేల్చి, బకాయిలను నాలుగు విడతలుగా అప్పటి ధాన్యం ఎంఎస్పి రేటు ప్రకారం చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు. ఖరీఫ్ ధాన్యాన్ని సివిల్ సప్లైస్ ద్వారా రా రైస్‌గా, రబీ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా స్వీకరించాలని డిమాండ్ చేశారు.ఎఫ్ సి ఐ కఠిన నిబంధనలను కొంతమేర సడలించి, లెవీ బియ్యాన్ని నిల్వ చేసేందుకు సరిపడా ఎఫ్ సి ఐ గోదాముల్లో స్థలం కల్పించాలని కోరారు. ప్రస్తుతం మిల్లర్ల వద్ద ఉన్న మొత్తం సీఎంఆర్ ధాన్యాన్ని త్వరగా తీసుకుని, అనంతరం 2026-27 ఖరీఫ్ సీజన్ ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించాలని రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సంఘం బాధ్యులు వివిధ జిల్లాల నుండి తరలివచ్చి కార్యక్రమం లో పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాలలోని రైస్ మిల్లర్స్ యజమానులు పాల్గొన్నారు.
