- District News
- విదేశీ కలుపు జాతి మొక్కల నిర్మూలనపై అవగాహన
విదేశీ కలుపు జాతి మొక్కల నిర్మూలనపై అవగాహన
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఈకో ఫాన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆక్రమణ జాతి కలుపు మొక్కల గుర్తింపు, నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు వి. విక్టర్, ఎన్ వై గిరి, అసిస్టెంట్ కలెక్టర్ రవి తేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఆక్రమణ జాతి కలుపు మొక్కలను అధికారులు, సిబ్బంది గుర్తించి తొలగించారు. ఆక్రమణ జాతి మొక్కల వ్యాప్తిని అరికట్టాలనే సంకల్పానికి ప్రతీకగా ఈకో ఫాన్ సొసైటీ రూపొందించిన ‘థంబ్స్ డౌన్’ సంకేతాన్ని కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ప్రదర్శించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, ఆక్రమణ జాతి కలుపు మొక్కలు పంటల ఉత్పాదకతను తగ్గించడంతో పాటు స్థానిక వృక్షజాతుల పెరుగుదలను అడ్డుకుంటాయని, జీవ వైవిధ్యానికి హాని కలిగిస్తాయని తెలిపారు. నీటి వనరులు, వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాల్లో వీటి వ్యాప్తిని ప్రారంభ దశలోనే గుర్తించి నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి శాఖ అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని సూచించారు. ఆక్రమణ జాతి మొక్కల నిర్మూలన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించాలని, ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఈకో ఫాన్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మేట్టు సాయి సంపత్ మాట్లాడుతూ, ఆక్రమణ జాతి కలుపు మొక్కల వల్ల వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, నీటి వనరులు, జీవ వైవిధ్యంపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించారు. వీటి నిర్మూలనకు ప్రభుత్వ శాఖలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈకో ఫాన్ సొసైటీ రాష్ట్ర సమన్వయకర్త తలారి విక్రమ్ తెలంగాణలో సాధారణంగా కనిపించే ప్రధాన ఆక్రమణ జాతి కలుపు మొక్కలను గుర్తించే విధానాన్ని వివరించారు. ప్రతి శాఖ తమ కార్యాలయ పరిసరాల్లో ఎప్పటికప్పుడు నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
అనంతరం అధికారులు, సిబ్బంది ఆక్రమణ జాతి కలుపు మొక్కల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. స్థానిక జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు అవగాహన కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించారు.
