- District News
- శ్రీ సరస్వతి విద్యానికేతన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
శ్రీ సరస్వతి విద్యానికేతన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
జాతీయ నినాదాలతో హోరెత్తిన వీధులు - పాత తరం నాయకుల పోరాటాలను విద్యార్థులకు తెలియజేయడమే లక్ష్యం
చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
స్థానిక శ్రీ సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ సత్యనారాయణ పాఠశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” అంటూ చేసిన నినాదాలతో గ్రామ వీధులు మారుమోగాయి. విద్యార్థుల ఉత్సాహం గ్రామస్తులను ఆకట్టుకుంది. పాఠశాల డైరెక్టర్ లిఖిత మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని, వారిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను అభినందించారు. స్వాతంత్ర్య సమరయోధుల దృఢ సంకల్పం, పోరాట స్ఫూర్తిని నేటి తరం విద్యార్థులకు తెలియజేస్తూ, వారిలో శారీరక, మానసిక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అరుణ మాట్లాడుతూ విద్యార్థులను కేవలం చదువుకే పరిమితం చేయకుండా అన్ని రంగాల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులను భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే తమ బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామస్తులు తమ పాఠశాలను ఆశీర్వదించి, తమ పిల్లలను పాఠశాలలో చేర్పించి ప్రోత్సహించాలని కోరారు. రాజేశ్వరి ఆధ్వర్యంలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమం విజయవంతం కావడానికి ఉపాధ్యాయులు రమేష్, శ్రీదేవి, ప్రమీల, శ్రావణి, పూజ, శైలజలు సహకరించారు. చివరగా విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
