- District News
- కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.
కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.
రంగురంగుల పూలతో బతుకమ్మల అలంకరణ.. విద్యార్థినుల సందడి - సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడమే లక్ష్యం
లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో విద్యార్థినులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనగా, పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. మన పూర్వీకుల ఆచార వ్యవహారాలు, పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడమే ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటామని వివరించారు.
ప్రకృతిలో సహజంగా లభించే తంగేడు, గునుగు, చామంతి, బంతి తదితర రంగురంగుల పూలను సేకరించి, వాటిని అందంగా పేర్చి బతుకమ్మను తయారు చేస్తారని విద్యార్థులకు వివరించారు. ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని, పూల ప్రాధాన్యతను చాటిచెప్పే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ చరిత్ర, జీవన విధానంలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకోవడంతో పాటు వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యతను గుర్తించాలని సూచించారు. విద్యతో పాటు మన మూలాలు, పండుగల ప్రాముఖ్యతను తెలుసుకోవడం ఎంతో అవసరమని ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
