- District News
- జోరుగా ఇసుక అక్రమ రవాణా!
జోరుగా ఇసుక అక్రమ రవాణా!
కరువైన అధికారుల నిఘా - అనుమతులు లేకుండానే నాలుగైదు ట్రాక్టర్లలో పట్టపగలే ఇసుక తరలింపు - ఆపేందుకు ప్రయత్నించినా నిలపకుండా ఓవర్‌స్పీడ్‌తో దూసుకెళ్తున్న వైనం
లోకల్ గైడ్/ తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ పరిధిలోని కాగ్న నది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం కాగ్న నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే సుమారు నాలుగైదు ట్రాక్టర్లలో పట్టపగలే ఇసుకను జహీరాబాద్ రోడ్డు మార్గం మీదుగా ఇందూరు, తట్టేపల్లి వైపు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఆపి అనుమతుల గురించి అడిగేందుకు ప్రయత్నించినా వాహనాలను నిలపకుండా ఓవర్‌స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. దీంతో ఇసుక రవాణాకు సంబంధించి అనుమతులు ఉన్నాయా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే
రోజురోజుకు ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాహనాలను తనిఖీ చేయాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
