- District News
- Khammam
- నీటి కుంటల నిర్మాణంతో భూగర్భ జలాల అభివృద్ధి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
నీటి కుంటల నిర్మాణంతో భూగర్భ జలాల అభివృద్ధి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
రైతుల పొలాల్లో నిర్మిస్తున్న నీటి కుంటలు (ఫారం పాండ్లు) భూగర్భ జలాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర టిఎస్ అన్నారు.
శనివారం కూసుమంచి మండల కేంద్రానికి చెందిన రైతు అర్వపల్లి వెంకటేశ్వర్లు పొలంలో నిర్మిస్తున్న నీటి కుంటను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రధాన రహదారి నుంచి సుమారు 600 మీటర్ల మేర డొంక రహదారిలో నడుచుకుంటూ వెళ్లి నీటి కుంట నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నీటి కుంటల నిర్మాణం వల్ల వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు, ఆ నీరు భూమిలోకి ఇంకి సమీపంలోని బోర్లు, బావుల్లో భూగర్భ జలమట్టం పెరుగుతుందని అన్నారు. నీటి నిల్వలు పెరగడం వల్ల భవిష్యత్తులో మత్స్య సంపద అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు.
రైతులు తమ పొలాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నీటి కుంట నిర్మాణం, పనుల పురోగతి, రైతులకు కలిగే ప్రయోజనాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, రైతులకు ఉపయోగపడే విధంగా పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కూసుమంచి తహసీల్దార్ సైదులు, గ్రామపంచాయతీ సర్పంచ్ కొండ కృష్ణవేణి, గ్రామపంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
