- District News
- Khammam
- సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
కొండా సుష్మిత బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఖమ్మం జిల్లా, సింగరేణి (కారేపల్లి) , ఆగస్టు 22 (లోకల్ గైడ్):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సుష్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగతంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరైన రాజకీయ సంస్కృతి కాదని ఆయన మండిపడ్డారు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను, ప్రజాప్రతినిధుల నిర్ణయాలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే రాజకీయ విమర్శలు హుందాగా, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత దూషణల స్థాయికి తీసుకెళ్లడం సరికాదని రాందాస్ నాయక్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవాన్ని కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా విమర్శలు చేయాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
అమెరికా పర్యటనను అడ్డుకోవడం సరికాదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు కల్పించడం, తెలంగాణకు కొత్త అవకాశాలను సాధించడం కోసం ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు చేపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపట్టే ఇలాంటి పర్యటనలకు రాజకీయాలకు అతీతంగా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పేర్కొన్నారు.
