- District News
- Ranga Reddy
- సన్న రకాల వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్!
సన్న రకాల వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్!
సెప్టెంబర్ 10లోగా పంట వివరాలు నమోదు చేసుకోవాలి.. ఆమనగల్లు మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాస్ గౌడ్
లోకల్ గైడ్ ఆమనగల్లు, ఆగస్టు 22:
తెలంగాణ ప్రభుత్వం సన్న రకాల వరి సాగును ప్రోత్సహించేందుకు ఎంపిక చేసిన ఏడు ప్రాధాన్యత రకాల వరిని సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందించనున్నట్లు ఆమనగల్లు మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ బోనస్ పొందేందుకు అర్హులైన రైతులు తమ పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఏడు రకాల సన్న వరికి బోనస్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సన్న రకాల వరి పంటల్లో ఆర్‌ఎన్‌ఆర్ 15048 (తెలంగాణ సోనా), బీపీటీ 5204 (సాంబా మసూరి), కేఎన్‌ఎం 1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్‌ఎం 7715 రకాలు ఉన్నాయని తెలిపారు.
ఈ రకాలను సాగు చేసిన రైతులు బోనస్ పొందేందుకు తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద నమోదు
వరి విత్తనాలను డీలర్ల వద్ద కొనుగోలు చేసి సాగు చేసిన రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్లను సంప్రదించి ఆన్‌లైన్‌లో పంట వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
అదేవిధంగా విశ్వవిద్యాలయాల నుంచి లేదా ఇతర రైతుల నుంచి విత్తనాలు తీసుకుని సన్న రకాల వరిని సాగు చేసిన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను (ఏఈఓలను) సంప్రదించి పంట వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
సెప్టెంబర్ 10 చివరి గడువు
సన్న రకాల వరి పంట నమోదు ప్రక్రియకు 2026 సెప్టెంబర్ 10వ తేదీ చివరి గడువు అని అధికారులు స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా పంట వివరాలు నమోదు చేసుకున్న రైతుల వివరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, ధాన్యం కొనుగోలు సమయంలో అర్హత ఉన్న రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.
అయితే నిర్ణీత గడువులోగా పంట వివరాలను నమోదు చేసుకోని రైతుల ధాన్యానికి కొనుగోలు సమయంలో బోనస్ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.
కావున ఆమనగల్లు మండల పరిధిలో సన్న రకాల వరిని సాగు చేసిన రైతులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే తమ పంట వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది.
రైతుల కోసం వ్యవసాయ విస్తరణ అధికారుల సంప్రదింపు నంబర్లు
నికిత – వ్యవసాయ విస్తరణ అధికారి, ఆమనగల్లు: 6305920207
మీనాక్షి – వ్యవసాయ విస్తరణ అధికారి, రాంనుంతల క్లస్టర్: 6305920210
భూదేవి – వ్యవసాయ విస్తరణ అధికారి, ఆకుతోటపల్లి క్లస్టర్: 6305920208
ప్రభావతి – వ్యవసాయ విస్తరణ అధికారి, పోలేపల్లి క్లస్టర్: 6305920209
