సర్పంచ్ ఉమా నరేష్ పట్టుదల.. మాదారం అభివృద్ధికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కీలక ఆదేశాలు!

రూ.3 కోట్లతో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ త్వరగా ప్రారంభించాలి.. దసరాలోపు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

Published On
సర్పంచ్ ఉమా నరేష్ పట్టుదల.. మాదారం అభివృద్ధికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కీలక ఆదేశాలు!

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 6, లోకల్ గైడ్ న్యూస్ : మాదారం గ్రామ అభివృద్ధిపై సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్ పట్టుదలతో ముందుకు సాగుతుండగా, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సానుకూలంగా స్పందించారు. మాదారం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి మండలంలోని సర్పంచులు, మండల అధికారులతో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కొత్త లింగాల ఫంక్షన్ హాల్‌లో సమావేశమయ్యారు. శనివారం రాత్రి సుమారు 12 గంటల వరకు కొనసాగిన ఈ సమావేశంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

రూ.3 కోట్ల సబ్‌స్టేషన్‌కు వేగం

మాదారం గ్రామంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశించారు. దసరాలోపు సబ్‌స్టేషన్‌ను ప్రారంభించే దిశగా పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే మాదారం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు రైతులు, ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

దసరాలోపు అభివృద్ధి పనులు

మాదారంలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రెండు మహిళా భవనాలు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలను దసరాలోపు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అధికారులకు సూచించారు. గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

గ్రామాలకు సర్పంచులే పట్టుకొమ్మలు

గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సర్పంచులు కీలకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సర్పంచులను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్పష్టం చేసినట్లు సమావేశంలో పాల్గొన్న నాయకులు తెలిపారు.

ఎమ్మెల్యేకు పూర్తి సహకారం

గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్కు పూర్తి సహకారం అందిస్తామని సర్పంచులు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా పనిచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మాదారం సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్, సింగరేణి మండల సర్పంచులు, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News