అశ్వారావుపేటలో గోల్డ్ లోన్ మాఫియా? నమ్మకమే పెట్టుబడిగా కోట్లలో మాయాజాలం!

​బ్యాంకు ఏజెంట్ల అవతారంలో ముఠా మోసాలు ​ఐదు లక్షల బంగారంపై పది లక్షల రుణం స్వాహా

​సామాన్యుడికి నిరీక్షణ.. బడాబాబులకు విముక్తి? ​రూ.35 లక్షల వ్యవహారంపై పోలీసు విచారణకు డిమాండ్
Published On
అశ్వారావుపేటలో గోల్డ్ లోన్ మాఫియా?  నమ్మకమే పెట్టుబడిగా కోట్లలో మాయాజాలం!

లోకల్ గైడ్ : ​అశ్వారావుపేట

కష్టకాలంలో ఆదుకుంటుందని దాచుకున్న పసిడి సామాన్యుడి చేతికి దక్కకుండా పోతోంది. పరిచయాలు, నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకుని అశ్వారావుపేట కేంద్రంగా సాగుతున్న ప్రైవేటు బ్యాంకులు, గోల్డ్ ఫైనాన్స్ ముఠా బాగోతం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. అమాయకుల బంగారాన్ని తక్కువ మొత్తానికి తాకట్టు పెడతామని చెప్పి, బ్యాంకుల వద్ద రెట్టింపు రుణాలు కాజేసి లక్షలాది రూపాయలు స్వాహా చేసిన వ్యవహారం స్థానికంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
నమ్మించి నిలువునా ముంచేశారు!IMG-20260919-WA0326
​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో స్థానికులకు సుపరిచితుడైన సుబ్బు అనే వ్యక్తి సి ఎస్ బి బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థలో సి ఆర్ ఓ గా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకుంటూ చలామణీ అయ్యాడు. బ్యాంకు నిబంధనలు తెలియని సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ బంగారాన్ని ఆయన చేతికి అప్పగించారు. ఇక్కడే అసలు దగా మొదలైంది. బాధితుడు రూ.5 లక్షల కోసం ఇచ్చిన బంగారాన్ని బ్యాంకులో ఏకంగా రూ.10 లక్షలకు తాకట్టు పెట్టి, బాధితుడికి రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా రూ.5 లక్షలను తన జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రశీదులు అడిగితే నా దగ్గరే భద్రంగా ఉన్నాయి అంటూ కాలయాపన చేయడంతో బాధితులు నేరుగా బ్యాంకును ఆశ్రయించగా అసలు బండారం బయటపడింది. తీరా చూస్తే బాధితుల బంగారం వేరే వ్యక్తుల పేర్లతో తాకట్టులో ఉండటం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.IMG-20260919-WA0328
​సామాన్యుడికి పడిగాపులు.. పెద్దల బంగారం మాయం?
​ఈ గోల్డ్ లోన్ స్కామ్‌లో రోజుకో కొత్త ట్విస్ట్ తెరపైకి వస్తోంది. ఓవైపు తమ బంగారం ఎక్కడుందో తెలియక, తీసుకున్న రుణానికంటే ఖాతాల్లో అదనపు బకాయిలు చూపిస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరోవైపు తెరవెనుక జరిగిన రహస్య చర్చల ఫలితంగా కొందరు బడా వ్యక్తుల బంగారం మాత్రం చడీచప్పుడు లేకుండా విడుదలైనట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైరవీల కోసమే లక్షలాది రూపాయలు చేతులు మారాయని, పెద్దల బంగారాన్ని బ్యాంకు సిబ్బంది సహకారంతో గుట్టుచప్పుడు కాకుండా తప్పించారనే వాదనలు వినిపిస్తున్నాయి.
రూ.35 లక్షల స్వాహా.. ఒక్కడేనా, వెనుక వ్యవస్థ ఉందా?
​సుమారు రూ.35 లక్షలకు పైగా సొమ్మును సొంత అవసరాల కోసం దారిమళ్లించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత పెద్ద ఎత్తున మోసం జరగడం ఒక్క వ్యక్తితోనే సాధ్యమా? లేక బ్యాంకు సిబ్బంది, బయటి ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల అండదండలు ఉన్నాయా? అన్నది ప్రధాన ప్రశ్న. అనధికారిక వ్యక్తులు ప్రజల నుంచి బంగారం తెచ్చి తాకట్టు పెడుతుంటే బ్యాంక్ యాజమాన్యం కేవైసీ ( కేవైసీ) నిబంధనలను ఎలా తుంగలో తొక్కింది? ఆభరణాలు తాకట్టు పెట్టిన వ్యక్తుల వివరాలు, రశీదులను నిబంధనల ప్రకారం ఎందుకు జారీ చేయలేదు? అనే విషయాలపై బ్యాంకు అధికారులు నోరు మెదపడం లేదు.
​ఫైనాన్స్ వ్యాపారుల పాత్రపై అనుమానాలు
​బ్యాంకుల నుంచి తీసుకున్న నగదు, బంగారం స్థానిక ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, తాకట్టు దుకాణాల ద్వారా చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ బ్యాంకు నుంచి మాయమైన పసిడి ఇతర ప్రైవేటు సంస్థలకు చేరితే.. ఆ లావాదేవీలు ఎవరి పేరిట జరిగాయి? రికార్డుల్లో ఎవరి పేర్లు ఉన్నాయి? అనే అంశాలను నిగ్గుతేల్చాల్సి ఉంది.
సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే! ​బాధితుల ఆవేదన
అరణ్యరోదనగా మారకముందే జిల్లా ఉన్నతాధికారులు, బ్యాంకింగ్ విజిలెన్స్ బృందాలు, పోలీసులు రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. కేవలం ఒకరిద్దరిపై నెపం నెట్టి అసలు సూత్రధారులు తప్పించుకోకుండా, బ్యాంకు రికార్డులను, సీసీటీవీ ఫుటేజీలను, కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News