- District News
- Khammam
- మూడు నెలలుగా జీతాల్లేవు.. ఉపాధి హామీ సిబ్బంది గగ్గోలు!
మూడు నెలలుగా జీతాల్లేవు.. ఉపాధి హామీ సిబ్బంది గగ్గోలు!
90 రోజులుగా వేతనాల కోసం ఎదురుచూపులు.. పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలి: భూక్య శివ నాయక్
ఖమ్మం జిల్లా, కారేపల్లి : ఆగష్టు 16 (లోకల్ గైడ్ ) :
ఉపాధి హామీ పథకం కింద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రెండు, మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ కారేపల్లి–కామేపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి భూక్య శివ నాయక్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేసి, ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కారేపల్లి మండల కేంద్రంలోని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కారేపల్లి–కామేపల్లి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంట్స్ ఆపరేటర్లు, అటెండర్లు, అదనపు కార్యక్రమ అధికారులు, ఉపాధి హామీ కోఆర్డినేటర్లు, డ్రైవర్లు తదితర సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, కార్మికులకు ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నెలల తరబడి జీతాలు అందని పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల మంది ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. అలాగే జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న పలువురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా గత 90 రోజులుగా జీతాలు అందలేదని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పిల్లల చదువులు, వైద్యం, కుటుంబ పోషణ భారంగా మారిన తరుణంలో నెలల తరబడి జీతాలు రాకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని శివ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల చెల్లింపులో సాంకేతిక కారణాలను చూపకుండా పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను ఒకేసారి విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి హామీ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు బకాయి వేతనాలు చెల్లించకపోతే జిల్లా, మండల, రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు భాగ్య, అరుణోదయ కళాకారులు దంతాల నారాయణ, పార్టీ జిల్లా నాయకులు కోటక్క, ఈసం శ్రీను, రాధక్క, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
