- District News
- Nalgonda
- అమెరికాసామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి.
అమెరికాసామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి.
యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.లోకల్ గైడ్.
అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. యుద్ధాల వల్ల మానవాళికి తీరని నష్టం వాటిల్లుతోందని, ప్రపంచ శాంతి సాధన కోసం ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవనంలో నిర్వహించిన అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్ఓ) జిల్లా 4వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.వ్యక్తుల ఆలోచనల నుంచే శాంతి లేదా యుద్ధం ప్రారంభమవుతుందని నెల్లికంటి సత్యం అన్నారు. చెడు ఆలోచనలు సమాజంలో విభజనలకు దారితీస్తాయని, సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో అమెరికా వంటి దేశాలు చిన్న దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తమ వ్యాపార ప్రయోజనాల కోసం కొన్ని ఐరోపా దేశాలు సైతం అమెరికా విధానాలకు మద్దతు పలుకుతున్నాయని అన్నారు. యుద్ధాల కారణంగా ఇరాక్, ఇరాన్ తదితర దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, నిత్యావసర వస్తువుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.సామ్రాజ్యవాదం నశించాలని, సామ్యవాదం వర్ధిల్లాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. సమాజంలో చోటుచేసుకునే పరిణామాలపై ప్రజలు మౌనంగా ఉండకుండా స్పందించాలని, అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తాలని సూచించారు.ఏఐపీఎస్ఓ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్. మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ప్రపంచ శాంతి ఆవశ్యకతను తెలియజేస్తున్నాయని అన్నారు. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు మధ్యప్రాచ్య దేశాల్లో కొనసాగుతున్న ఘర్షణలు మానవాళిని ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. యుద్ధాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు అనేక కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయని, అభివృద్ధి చెందిన నగరాలు సైతం శిథిలాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం ఎవరికీ మేలు చేయదని, మానవాళికి అపారమైన నష్టాన్ని మాత్రమే మిగులుస్తుందని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ యుద్ధాల ప్రభావం ఆయా దేశాలకే పరిమితం కావడం లేదని, భారతదేశ ఆర్థిక వ్యవస్థపైనా పడుతోందని వివరించారు. పెట్రోల్, గ్యాస్‌తోపాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఏఐపీఎస్ఓ దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులను ఏకం చేస్తూ ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో శాంతిని కోరుకునే ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి 4వ జిల్లా మహాసభ నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. మహాసభకు శాంతి సంఘం జిల్లా అధ్యక్ష వర్గం అనంతుల శంకరయ్య, కట్ట వెంకటరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, శాంతి సంఘం రాష్ట్ర కార్యదర్శి జి. నాగేశ్వరరావు, ఉపాధ్యక్షురాలు ప్రొఫెసర్ సమత,జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి జిల్లా యాదయ్య,పర్యావరణ పరిరక్షణ వేత్త శ్యామల నాగసేనారెడ్డి,మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు పసల శౌరయ్య, మైనారిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఏ. ఖాన్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చలం రంగారావు, సీనియర్ నాయకులు నేతి యాదగిరి, బుక్క ఈశ్వరయ్య, కోమటిరెడ్డి ప్రద్యుమ్నారెడ్డి, షరీఫుద్దీన్,కస్తాల వెంకన్న, తెలగమల దశరథ,బి. సప్న,ఇమాబిన్ తదితరులు పాల్గొన్నారు.
