- District News
- Ranga Reddy
- రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవండి.. వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవండి.. వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి
పోలీసు అమరవీరుల సంస్మరణార్థం ఇబ్రహీంపట్నంలో భారీ రక్తదాన శిబిరం స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 29 ( లోకల్ గైడ్)
సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ, ఆపదలో ఉన్న తోటివారి ప్రాణాలను కాపాడాలనే ఉన్నత సంకల్పంతో ఇబ్రహీంపట్నం పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని గురువారం స్థానిక శాస్తా గార్డెన్‌లో ఇబ్రహీంపట్నం ఏసీపీ కే. రాజు, ఎస్‌హెచ్‌ఓ మహేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి స్వయంగా రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా సమాజహితం కోసం జరిగే రక్తదానం వంటి సేవా కార్యక్రమాల్లోనూ పోలీసులు ఎప్పుడూ ముందుంటారని ఆయన ఈ సందర్భంగా నిరూపించారు. సీపీ రక్తదానం చేయడంతో ప్రేరణ పొందిన పోలీస్ అధికారులు, సిబ్బంది, పలు కళాశాలల విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు.
యువత వ్యసనాలకు బానిస కావొద్దు సీపీ తరుణ్ జోషి పిలుపు
ఈ సందర్భంగా కమిషనర్ తరుణ్ జోషి సందేశమిస్తూ.. యువత ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు బానిస కావద్దని, ముఖ్యంగా మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారికి దూరంగా ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని హితవు పలికారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకుని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఆపదలో ఉన్న తోటి మనిషిని ఆదుకోవడంలో రక్తదానమే అత్యున్నత దానమని, ఒకరి రక్తదానం ఎందరో ప్రాణాలను నిలబెడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తెరిగి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ శిబిరంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక కళాశాలల విద్యార్థులు, వివిధ గ్రామాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం సేవ, సామాజిక స్పృహలకు ప్రతీకగా నిలిచింది.
