- District News
- Ranga Reddy
- ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా విధులు నిర్వహించాలి
ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా విధులు నిర్వహించాలి
రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్
గండిపేట, సెప్టెంబర్ 30 (లోకల్ గైడ్):
పోలీసులు ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా విధులు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. బుధవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)లో శిక్షణ పొందుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో నిర్వహించిన
కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ యువ పోలీస్ అధికారులు నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో శారీరక, మానసిక దృఢత్వం ఎంతో ముఖ్యమని, ప్రతిరోజూ కనీసం గంటపాటు క్రీడలు లేదా వ్యాయామానికి కేటాయించాలని సూచించారు.
బాస్ వేరు.. నాయకుడు వేరు
పదవిలో ఉన్నంత మాత్రాన నాయకత్వ లక్షణాలు రావని, నాయకుడికి ప్రత్యేకమైన లక్షణాలు అవసరమని డీజీపీ పేర్కొన్నారు. ధైర్యం, స్పష్టమైన దార్శనికత, సమగ్రత, విలువలు–నైతికత, బృంద స్ఫూర్తి, నిష్పక్షపాత వైఖరి, సమర్థమైన కమ్యూనికేషన్, కష్టపడి పనిచేసే తత్వం, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతతో పాటు వినయం ముఖ్యమైన నాయకత్వ లక్షణాలని వివరించారు.
యువ అధికారులు నైతిక విలువలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విధి నిర్వహణలో చేసే చిన్న పొరపాట్లు కూడా భవిష్యత్తులో వారి ప్రతిష్ఠపై ప్రభావం చూపుతాయని అన్నారు. పోలీస్ సర్వీసులో మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ ఉండే నేపథ్యంలో ప్రతి అధికారి తన ప్రతిష్ఠను కాపాడుకోవడం అత్యంత కీలకమని చెప్పారు.
చట్ట పరిజ్ఞానంతో పాటు మానవీయ దృక్పథం
శిక్షణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై ప్రొబేషనరీ డీఎస్పీలు అవగాహన పెంచుకోవాలని డీజీపీ సూచించారు. ప్రజలతో వ్యవహరించడం, నేరాల దర్యాప్తు, చట్టాల అమలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో వినియోగించడం వంటి అంశాల్లో సమగ్ర నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు.
చట్టాలపై పరిజ్ఞానం మాత్రమే మంచి పోలీస్ అధికారిగా తీర్చిదిద్దదని, నాయకత్వం, మానవీయ దృక్పథం, దర్యాప్తు నైపుణ్యం, సాంకేతిక అవగాహన, శారీరక దృఢత్వం, ప్రజలతో సమర్థమైన కమ్యూనికేషన్ కూడా అవసరమని పేర్కొన్నారు.
“ప్రజలకు భద్రత కల్పించడం, వారికి సకాలంలో న్యాయం అందేలా చూడటమే పోలీసింగ్ అంతిమ లక్ష్యం” అని డీజీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఐజీపీ (పి&ఎల్) గజరావు భూపాల్, డిప్యూటీ డైరెక్టర్లు చేతన, మురళీధర్, ఇతర సీనియర్ అధికారులు, అకాడమీ సిబ్బంది, ట్రైనీ ప్రొబేషనరీ డీఎస్పీలు పాల్గొన్నారు.
