కోట్లు పలికే 'పీఓటీ' భూములపై డేగ కన్ను!

రికార్డుల్లో సర్కారు పరం.. క్షేత్రస్థాయిలో ప్రహరీల మాయం!

ఎకరా రూ.4 కోట్లకు చేరడంతో అక్రమార్కుల కన్ను.. అధికారుల కనుసన్నల్లోనేనా?
Published On
కోట్లు పలికే 'పీఓటీ' భూములపై డేగ కన్ను!

 

 

 

ఇబ్రహీంపట్నం అక్టోబర్ 28 ( లోకల్ గైడ్ )

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రావడంతో విలువైన ప్రభుత్వ, పీఓటీ భూములకు రక్షణ లేకుండా పోతోంది. ఒకప్పుడు పేదలకు జీవనోపాధి కల్పించిన లావణీ పట్టా భూములు, నిబంధనల ఉల్లంఘనతో ప్రభుత్వం స్వాధీనం  చేసుకున్న స్థలాలు ఇప్పుడు అక్రమార్కుల చేతుల్లో శరవేగంగా చేతులు మారుతున్నాయి. కోట్లలో పలుకుతున్న మార్కెట్ విలువను ఆసరాగా చేసుకుని, ప్రభుత్వ పరిధిలోని పీఓటీ భూములను సైతం పట్టా భూములంటూ నమ్మించి విక్రయాలు సాగిస్తున్న వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

రికార్డుల్లో 'పీఓటీ'.. క్షేత్రస్థాయిలో ప్రీకాస్ట్ ప్రహరీలు!

రాందాస్‌పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 86లో మొత్తం 24 ఎకరాల 21 గుంటల లావణీ పట్టా భూమి ఉంది. (తూర్పున 50, 51, 54; పడమరన 85; దక్షిణాన 45, 43, 41/58, 50; ఉత్తరాన 2, 3, 6, 7 సర్వే నంబర్ల హద్దులున్నాయి). ఇందులో నిబంధనల ఉల్లంఘన జరిగిన కారణంగా సబ్ డివిజన్లు 86/3, 86/4, 86/7, 86/22, 86/23, 86/31, 86/37 లను రెవెన్యూ అధికారులు గతంలోనే పీఓటీ ( పి ఓ టి యాక్ట్ , 1977) కింద ప్రభుత్వ స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా 86/3, 86/31 తదితర బిట్లను సర్కారు పరం చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయ....అలాగే సర్వే నంబర్ 41/పార్ట్ పరిధిలో దాదాపు 1200 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ఉన్న పట్టా భూమికి ఆనుకుని రోడ్డుకు తూర్పు, ఉత్తర దిశల్లో సుమారు 10 ఎకరాల పీఓటీ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ దాదాపు రూ.4 కోట్ల పైమాటే. అయితే, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ స్థలాల్లో ఎక్కడా "ఇది ప్రభుత్వ భూమి - అతిక్రమిస్తే చర్యలు తప్పవు" అన్న సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. దీనిని అదనుగా చూసుకుని పీఓటీ స్థలాల చుట్టూ రాత్రికి రాత్రే ప్రీకాస్ట్ గోడలు, ప్రహరీలు నిర్మించి, పక్కనే ఉన్న పట్టా భూముల ముసుగులో కలిపేసి రిసార్టులు, వెంచర్లకు దారులు తీస్తున్నారని, క్రయవిక్రయాలు సాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

IMG-20261029-WA0025IMG-20261029-WA0024ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్టేనా?

ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల సమగ్ర సర్వేలు, రికార్డుల ప్రక్షాళన చేపడుతుంటే.. క్షేత్రస్థాయిలో డేగలు కోడిపిల్లలను తన్నుకుపోయిన చందంగా ప్రభుత్వ ఆస్తులు కనుమరుగవుతుండటం గమనార్హం.
ప్రభుత్వ ఆధీనంలోని భూముల్లో కొత్తగా ప్రహరీలు నిర్మిస్తుంటే స్థానిక రెవెన్యూ, అధికార యంత్రాంగం దృష్టికి రాలేదా?
తెలిసీ తెలియనట్లు మిన్నకుండిపోతున్నారా?
అక్రమార్కులతో లోపాయికారీ ఒప్పందాలు ఏమైనా సాగుతున్నాయా?
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టేలా సాగుతున్న ఈ భూ వ్యవహారాలపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని, ప్రభుత్వ భూముల్లో అధికారిక సూచిక బోర్డులు నాటి కబ్జాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:

About The Author

Latest News